అమరావతి- దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు తగ్గిపోతున్నాయి. అందుకు అనుగనంగానే మరణాల సంఖ్య సైతం పడిపోయింది. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఎత్తేస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆదివారం రోజు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వేయడంలో రికార్డు సృష్టించబోతున్నారు.
ఏపీలో ఆదివారం ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఒక్కరేజే 8 లక్షల కరోనా వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్ల కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు కూడా ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ అందించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే ఒక్క రోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఆదివారం ఒక్క రోజే 8 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి ఆ రికార్టును బద్దలు కొట్టి, కొత్త రికార్టును నెలకొల్పేందుసు సమాయుత్తం అయింది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 1 కోటి 22 లక్షల 83 వేల 479 వ్యాక్సిన్ డోసులను ప్రభుత్వం ప్రజలకు అందించింది. మొత్తం 5 లక్షల 29 వేల మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు సైతం తొలి డోస్ వ్యాక్సిన్ వేశారు. ఏపీలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ఒక్కరోజులో 6 లక్షల కరోనా వాక్సిన్ డోస్‌లను వేశారు. ఈ రికార్డులు మళ్లీ తామే బద్ధలు కొట్టేలా ఒకేసారి ఆదివారం 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రంగం సిద్దం చేశారు అధికారులు.