తిరుపతిలో మళ్ళీ మొదలైన వర్షం! భయాందోళనలో ప్రజలు!

tirupati heavy rains

తిరుపతిలో మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో తిరుపతి ప్రజలు అల్లాడుతుంటే మరోసారి ఉపద్రవంలా భారీ వర్షం ముంచెత్తింది. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాయుగుండం ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి నగరం సముద్రంలా మారింది. వర్షాలు కాస్త శాంతించాయి అనుకుంటే మరోసారి విరుచుకుపడ్డాడు వరుణుడు. తిరుపతిలో రోడ్లు కాలువల్లా మారాయి, కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు రెండు రోజులుగా వరద నీటిలోనే నానిపోతున్నారు. తిండి లేదు.. తాగటానికి గుక్కెడు మంచినీరు లేక.. వరద నీటితో తిరుపతి నగర ప్రజలు అతలాకుతలమయ్యారు. ఏడు కొండలపై కురుస్తున్న వర్షపు నీరు కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది.

వాన దెబ్బ.. ఇప్పటికీ నలువైపుల నుంచి వరద నీరు వచ్చిపడుతూనే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రేణిగుంట – చెన్నై రైల్వే లైన్ తొమ్మిది గండ్ల వారధి దగ్గర నది పరవళ్లు తొక్కుతోంది. రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళవలసిన పలు రైళ్లను, వయా గూడూరు మీదుగా తరలించారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. భారీ వర్షానికి గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయాయి. దీంతో తిరుపతి రూరల్ నుంచి అర్బన్‌ కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికీ పలురోజులుగా కురుస్తోన్న వానలతో అల్లాడిపోయిన తిరుపతి నగరంలో.. మళ్లీ భారీ వర్షం కురుస్తోండటంతో అక్కడి వారి బాధలు వర్ణానాతీతంగా మారాయి.