రుయా ఘటనపై ప్రభత్వాన్ని కడిగిపారేసిన చంద్రబాబు!

కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ ఒక్క మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. ప్రజల ప్రాణాలు సైతం గాలిలో దీపాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవ్వరి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సిన నాయకులు, అధికారులు కూడా పరిస్థితిలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రాక 5 నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ను పునరుద్దరించకపోయి ఉంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించి ఉండేది. రాత్రి 8గంటల నుంచి 8.30గంటల సమయంలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య ఏర్పడితే.., అంత ఆలశ్యం అయ్యే వరకు ఆక్సిజన్ ఎందుకు తెప్పించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి లోకల్ నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకుని ఉండుంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త ఘాటుగా స్పందించారు. ఆక్సిజన్ అందక వరుసగా ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కాక మరేంటి? ప్రతిరోజు ఒక్కో జిల్లాలో ఇలా కరోనా రోగులు చనిపోతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో ఆక్సిజన్ అందక 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక మృతుల కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొదించుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ మాత్రం ఆక్సిజన్ ట్యాంకర్ రాక ఆలస్యం అవుతుందని ఉహించలేకపోయామని, అంతే తప్ప ఆస్పత్రిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని ఓ ప్రకటనలో తెలియచేశారు.