అండమాన్ తుఫాన్ వచ్చేస్తోంది, ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలు

cyclone

న్యూ ఢిల్లీ- తౌక్టే తుఫాను బీభత్సం నుంచి తేరుకోక ముందే మరో తుఫాను ముంచుకొస్తోంది. కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను తౌక్టే సైక్లోన్ అతలాకుతలం చేసింది. జన జీవనాన్ని అస్థవ్యస్తం చేయడంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు మరో తుఫాను దాడికి సిద్దంగా ఉంది. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24 వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ తెలిపింది. ఈ నేపథ్యం ఆంధ్రప్రదేశ్‌ సహా తీర ప్రాంతంలో ఉన్న అయిదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రధాన కార్యదర్శులకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖ రాశారు.

cyclone

అండమాన్ సముద్రంలో ఏర్పడిన తుఫాను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మధ్య ఈ నెల 26న తుపాను దాటే అవకాశం ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ సైక్లోన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌‌తో పాటు తూర్పు కోస్తా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు తలెత్తే ప్రమాదమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ప్రజారోగ్యంపై ఇప్పుడు నీళ్లు, దోమలు, గాలి ద్వారా సంక్రమించే రోగాలు ప్రబలే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపధ్యంలో అత్యవసర మందులను నిల్వచేసుకోవడంతో పాటు, ఆహారం కొరత లేకుండా లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది.

ముందస్తు చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు తీర ప్రాంతాల్లో తుపాన్ షెల్టర్లను సమాయత్తం చేశారు. రాబోయే తుపాన్ ను ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాల్లో పరిపాలనా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది. తుపాన్ విపత్తు దృష్ట్యా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను హెచ్చరికలు జారీ చేసి తిరిగి ఒడ్డుకు రావాలని కోతెలిపారు. తుపాన్ నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్, రెండు విమానాలు, ఓడలు పెట్రోలింగ్ చేస్తున్నాయి. తుఫాను ప్రబావం తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంద్రప్రదేశ్ పై కొంత మేర ఉండనుందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోస్తా, రాయల సీమ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది.