రెండు సినిమాల్లో నటించింది, కానీ వెండి తెరపై చూసుకోలేదు, అంతలోనే

గోవా క్రైం- ఆమె సినీ వినీలాకాశంలో విహరించాలనుకుంది. వెండి తెరపై తనను తాను చూసుకుని మురిసిపోవాలని కలలు కంది. అందుకోసం ఎంతో కష్టపడింది. చివరికి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అంతలోనే విధి వక్రీకరించింది. ఆమె తనను తాను వెండితెరపై చూసుకోకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లింది.

గోవాలోని బాఘా కలంగుట్ వద్ద సోమవారం ఉదయం వంతెనపై నుంచి కారు క్రీక్‌లో పడిపోవడంతో పూణేకు చెందిన నటి ఈశ్వరీ దేశ్‌పాండే తో పాటు ఆమె స్నేహితుడు శుభమ్ డేడ్జ్ అక్కడికక్కడే మృతి చెందారు. హిందీతో పాటు మరాఠీ సినిమాలలో నటించిన ఈశ్వరీ దేశ్‌ పాండే తన రెండు సినిమాలు విడుదలకు ముందే చనిపోయింది. ప్రమాదంలో చనిపోయిన శుభమ్ మరియు ఈశ్వరి బుధవారం పూణే నుండి గోవాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రోడ్డుపై వాహనం అదుపు తప్పి నేరుగా క్రీక్‌లోని లోతైన వాగులోకి దూసుకెళ్లింది.

eshwari deshpande 1

యాక్సిడెంట్ తరువాత సెంట్రల్ లాక్ కారణంగా ఈశ్వరి, శుభమ్ లు కారులోనే చిక్కుకుపోయారు. ఇద్దరి ముక్కుల్లోకి నీరు వెళ్లడంతో ఊపిరాడక వారు చనిపోయారు. ఈశ్వరి దేశ్ పాండే ఒక మరాఠీ, మరో హిందీ సినిమాలో నటించగా, ఈ రెండు సినిమాల షూటింగ్ అయిపోయింది. ఐతే వెండితెరపై తనను తాను చూసుకోకుండానే ఆమె చనిపోయింది. ఈశ్వరి దేశ్‌పాండే మొదటి సినిమా సునీల్ చౌతమాల్ దర్శకత్వం వహించిన ప్రేమచే సైడ్ ఎఫెక్ట్స్.

ఈశ్వరి దేశ్‌పాండే, శుభమ్ డేడ్గే సంవత్సరం నుంచి డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం స్నేహంగా, ఆ తరువాత ప్రేమగా మారింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్న టైంలో ఇద్దరినీ మరణం కబలించి వేసింది. శుభమ్ డెడ్జ్ పుణెలోని కిర్కట్వాడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించి, విచారణ చేపట్టారు. ఏదేమైనా ఇరువురి కుటుంబాల్లో వీషాదం చోటుచేసుకుంది.