అతి తీవ్ర తుఫాన్‌గా ముంచుకొస్తోన్న ‘తౌక్తే’!!.

మరో 24 గంటల్లో ముంబై, థానె, ఉత్తర కొంకణ్‌, పాలగఢ్‌ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్‌గఢ్‌లో మరింత ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. తీర ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని సూచించింది. తుఫాన్‌ నుంచి ముంబై నగరానికి నేరుగా ముప్పులేదని వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు, ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలతో పశ్చిమ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్‌ తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కర్ణాటకలో భారీ వర్షాలకు 73 గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌కు భారీ వర్ష సూచన ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌ ఆదివారం అత్యంత తీవ్రమైన తుఫాన్‌గా మారింది. ముంబైకి దక్షిణ నైరుతి దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో తుఫాన్‌ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. మంగళవారం వరకూ భారీ వర్షాలు కురుస్తాయని సూచించారు. తుఫాన్‌ ఉత్తర వాయువ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రానికి గుజరాత్‌ తీరం తాకుతుందని, మంగళవారం ఉదయం పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో 150 నుంచి 170 కి.మీ వేగంలో గాలులు వీస్తాయని హెచ్చరించారు.

Cyclone Tauktae Mumbai c

ఇప్పటికే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాలలో 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. తుఫాన్‌ ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుఫాన్‌ దిశగా గాలులు వీస్తున్నందున ఉక్కపోత కొనసాగుతుందన్నారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశముంది. తుఫాన్‌ ప్రభావ పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎంలు ఉద్ధవ్‌ ఠాక్రే, విజయ్‌ రూపానీతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.