పబ్జీ ఆన్ లైన్ గేమ్ మళ్లీ వచ్చేస్తోంది

pubg game

ఇంటర్నేషనల్ డెస్క్- పబ్జీ.. ఈ గెమ్ గురించి చాలా మందిికి తెలుసు. పబ్జీ చాలా ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్ గా చెప్పవచ్చు. ఈ గేమ్ మాయలో పడి చాలా మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు మనం చూశాం. దీంతో భారత్ తో పాటు చాలా దేశాలు పబ్జీ గేమ్ ను బ్యాన్ చేశాయి. ఐతే మళ్లీ ఇప్పుడు పబ్జీ ఆన్‌ లైన్‌ మొబైల్‌ బ్యాటిల్‌ గేమ్‌ భారత్‌లోకి మళ్లీ రాబోతోంది. పబ్జీ మొబైల్‌ ఇండియా పేరుతో ఇంతకు ముందు భారతీయులకు సుపరిచితమైన ఈ గేమ్‌ను.. బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా పేరుతో త్వరలో అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన ఆ గేమింగ్‌ యాప్‌ మాతృ సంస్థ క్రాఫ్టాన్‌ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ముందు ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత గేమ్‌ను భారత్‌లో లాంచ్‌ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. వినియోగదారుల డేటాకు పూర్తిస్థాయిలో భద్రత ఉండేలా ఫీచర్లను అభివృద్ధి చేశామని, భారత్‌కు చిహ్నంగా మూడు రంగులతో ఈ గేమ్‌ను తీసుకువస్తున్నామని వివరించింది. ఐతే భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న 118 చైనా యాప్‌లను గత ఏడాది సెప్టెంబరు 2న భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాకు చెందిన యాప్‌ అయినా.. చైనా కంపెనీలకు భాగస్వామ్యం ఉండడంతో పబ్జీపైనా నిషేధం వేటు పడింది. మళ్లీ ఇప్పుడు పబ్జీని రీ లాంచ్ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.