కరోనాను కట్టడి చేయకపోతే మూడో వేవ్ వచ్చేస్తుంది- ఎయిమ్స్ డైరెక్టర్

guleria
Aims director

న్యూ ఢిల్లీ (నేషనల్ డెస్క్)- భారత్ లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు.  దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కూడా ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు వైరస్ వ్యాప్తిని నియంత్రించలేవని, పూర్తి స్థాయి లాక్ డౌన్ విధిస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన అన్నారు. అంతే కాదు పరిస్థితులు ఇలాగే కొనసాగితే కరోనా మూడో వేవ్‌కు సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ హెచ్చరించారు. కరోనాను అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌డౌనే ఒక్కటే ఇప్పుడు పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాదు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు, మూడో వేవ్‌ కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

20210426 wsfl20210426101as
రణదీప్ గులేరియా

ఇక ప్రజలు భౌతిక దూరం తప్పకుండా పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోను గుంపులుగా తిరగవద్దని గులేరియా చెప్పారు. ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక కనీసం రెండు వారాలైనా లాక్‌డౌన్ విధించాలని, ముందస్తుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు.