త్రివిక్రమ్ మరో ప్రయోగం! మహేశ్ సినిమాలో సిమ్రాన్!

ఓ సినిమా జయాపజయాన్ని నిర్ణయించేది కచ్చితంగా ఆ చిత్ర కథ మాత్రమే. సినిమాలో మిగతా అంశాలన్నీ ఆ కథని చెప్పడానికి ఉపయోగపడే సోర్సెస్ అంతే. కానీ.., ఓ మంచి కథ ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే.., ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు కూడా అంతే బాగా కుదరాలి. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర. అప్పటికే నదియా తెలుగు ప్రేక్షకులకి తెలిసిన మొహమే అయినా.., ఆమెని అంతా మరచిపోయి ఉన్నారు. సరిగ్గా.. అలాంటి సమయంలో నదియాని అత్తగా ఓ హుందాతనం ఉండే పాత్రలో అద్భుతంగా ప్రజెంట్ చేశాడు త్రివిక్రమ్. దీనితో ఆ సినిమా స్థాయి మరింత పెరిగిపోయింది. ఇలాంటి ప్రయోగాలు త్రివిక్రమ్ కి కొత్తేమి కాదు. అజ్ఙాతవాసి సినిమా కోసం సీనియర్ హీరోయిన్ కుష్భు, అలా వైకుంఠ పురంలో టబు, అరవింద సమేత సినిమాలో దేవయానిని ఇలానే సెలెక్ట్ చేసుకున్నాడు మాటల మాంత్రికుడు. ఈ పిక్ అప్స్ అన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. తాజాగా ఇప్పుడు మహేశ్ సినిమా కోసం ఇలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడట గురూజీ.

త్వరలోనే మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలు కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ సిమ్రాన్ ను తీసుకోవాలనుంకుటున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. గతంలో మహేష్ బాబు, సిమ్రాన్ కలసి యువరాజు చిత్రంలో నటించారు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. తరువాత కాలంలో సిమ్రాన్ పెళ్లి చేసుకుని సినిమాలకి దూరం అయ్యింది. కొంత కాలం తరువాత ఈ అమ్మడు కమ్ బ్యాక్ ఇచ్చినా సరైన అవకాశాలు లభించలేదు. దీనితో ఇన్నాళ్లు సిమ్రాన్ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే.., ఇప్పుడు మహేష్ తో సినిమా కోసం త్రివిక్రమ్ నుండి కబురు రాగానే.., సిమ్రాన్ వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి ఒకప్పటి ఈ అందాల తారని. త్రివిక్రమ్ ఇప్పుడు ఎంత కొత్తగా స్క్రీన్ పై ప్రజంట్ చేస్తాడో చూడాలి.