అప్పు పై మీ ప్రేమ చూసి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. పునీత్ భార్య

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంతో కన్నడ ఇండస్ట్రీనే కాదు.. యావత్ ప్రజానీకం కన్నీరు పెట్టుకుంది. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయన హీరో అనిపించుకున్నారు. నటుడిగానే కాదు సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక కుటుంబ సభ్యులు ఆవేదన వర్ణనాతీతం.. తమ మధ్య నవ్వుతూ సంతోషంగా తిరిగిన తమ ఇంటి సభ్యులు లేడు, ఇక తిరిగి రాడు అన్న విషయాన్నీ వారు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

appua minతాజాగా పునీత్ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇప్పటివరకు యాక్టివ్‌గా ఉండని ఆమె అకౌంట్‌ ఓపెన్‌ చేసి మరీ మొదటి పోస్టును పునీత్‌ రాజ్ కుమార్‌కు అంకితమిచ్చారు. ‘శ్రీ పునీత్‌ రాజ్‌ కుమార్‌ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు, మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్‌గా ఉంది. ఆయన్ను ‘పవర్ స్టార్‌’ చేసిన అభిమానులకు పునీత్‌ లేని లోటు ఊహించడం కష్టమే. ఇలాంటి స‌మ‌యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా, మ‌నో నిబ్బ‌రంతో గౌరవంగా ఆయ‌న‌కు వీడ్కోలు పలికారు. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ఇండియాతో పాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు.

apraga minఅప్పు (పునీత్‌ రాజ్‌ కుమార్‌)ని వేలాది మంది ఫాలో అవ్వడం, ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం, మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన‍్ను ఆదర్శంగా తీసుకొని మీరు చేసే మంచి పనుల్లో పునీత్‌ జీవించే ఉంటారు. మీ ప్రేమ, మద్దతు కోసం మా మొత్తం కుటుంబం తరఫున అభిమానులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.’ అంటూ అశ్విని కృతజ్ఞతలు తెలిపారు. పునీత్‌ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అది తట్టుకోలేని 21 మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. వేలాది మంది అభిమానులు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు.