సూర్యాపై దాడి చేసిన వారికి లక్ష ఇస్తానన్న PMK జిల్లా కార్యదర్శి వ్యాఖ్యలపై చర్యలు..

jai bhim

హీరో సూర్యా నిర్మించి.. నటించిన జై భీమ్‌ సినిమా ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమా చూసిన తర్వాత అందరూ ప్రశంసించిన ఈ సినిమాపై విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. PMK జిల్లా కార్యదర్శి.. సూర్యాపై దాడి చేస్తే లక్ష రూపాయలు రివార్డు ఇస్తానన్న విషయం తెలిసిందే. ఆ నాయకుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హీరో సూర్యా ఇంటికి పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. వన్నియార్‌ సంఘం నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ఎవరైనా దాడి చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.  చెన్నై టీనగర్‌ లోని హీరో సూర్యా ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. అంతే కాకుండా మరోవైపు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పలు సెక్షన్లలో కేసులు కూడా నమోదు చేశారు.

అసలు ఏం జరిగిందంటే..

అన్ని వర్గాల వైపు నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటున్న ‘జై భీమ్’చిత్ర యూనిట్ కి వన్నియార్ సంఘం షాక్ ఇచ్చింది. చిత్రంలోని కొన్ని సంఘటనలు తమ వర్గాన్ని కించపరిచేలా, పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్ర యూనిట్కు లీగల్ నోటీసు జారీ చేశారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ఇస్తామంటూ పీఎంకే జిల్లా కార్యదర్శి ప్రకటించి సంచలనం సృష్టించారు. మరోవైపు సూర్య సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర వెళ్లి పీఎంకే నేతల నిరసన వ్యక్తం చేశారు. జై భీమ్‌ సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియార్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం లీగల్ నోటీసు జారీ చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కలిగించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నప్పటికీ, రాజకన్నును హింసించే పోలీసు పాత్రను ఉద్దేశపూర్వకంగా వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇదే వివాదంఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. ‘జై భీమ్‌లోని ప్రధాన అంశం రిటైర్డ్ జస్టిస్ చంద్రు వాదించిన కేసులో అధికారులపై న్యాయ పోరాటం ఎలా సాగింది. న్యాయం కోసం ఆయన ఎలా సహాయపడ్డారు అన్న అంశాలను మాత్రమే చూపించేందుకు ప్రయత్నించాము’ అని సూర్య వివరణ ఇచ్చారు.