రైటర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉన్న చోట మా అసోసియేషన్ కోసం స్థలం తీసుకున్న స్థలాన్ని మా అధ్యక్షుడిగా నరేష్ చాలా చీప్‌గా అమ్మేసినట్లు నాగబాబు ఆరోపించారు. తాను మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూ.45 లక్షలతో స్థలం కొని, దాన్ని ఫర్నిషింగ్ చేసేందుకు ఇంకొంత ఖర్చు చేసినట్లు మొత్తం రూ.95 లక్షల దాకా అయినట్లు ఆయన పేర్కొన్నారు. నా తర్వాత అధ్యక్షులుగా చేసిన వారు దాన్ని కొన్ని రోజులు అద్దెకు కూడా ఇచ్చారు. అనంతరం నరేష్ అధ్యక్షుడిగా ఉండి దాదాపు కోటి, కోటిన్నర విలువగల స్థలాన్ని చాలా చీప్‌గా కేవలం రూ.35 లక్షలకే అమ్మేశారని, అలా అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని నాగబాబు ప్రశ్నించారు.
దీనిపై నరేష్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైటర్స్, డైరెక్టర్స్‌తో నటీనటులకు మంచి ర్యాపో ఏర్పడుతుందనే కారణంతో వారి అసోసియేషన్లకు పక్కనే స్థలం తీసుకుంటే దాన్ని అమ్మేశారని పేర్కొన్నారు. అలాగే తాము విష్ణుని కానీ, మోహన్‌బాబును కానీ మద్దతు కోరలేదని, అలాగే విష్ణు కూడా తమను మద్దతు కోరలేదని అన్నారు. ప్రకాష్‌రాజ్ మా అధ్యక్షుడిగా సేవ అందించాలని అనుకున్నట్లు ముందుగా మేమే ప్రకటించామని తర్వాతే విష్ణు పోటీలోకి వచ్చాడాని ఆయన పేర్కొన్నారు. ప్రకాష్‌రాజ్‌కు చిరంజీవి, పవన్‌కళ్యాన్ మద్దతు ఉందని ప్రకటించారు.