ఫిల్మ్ డెస్క్- ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కిడ్నీలో రాళ్లు ఏర్పడి ఇబ్బంది పడుతున్న మన్సూర్ అలీ ఖాన్ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్ లో చేరారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. రెండు రోజులు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమని వైద్యులు తెలిపారట. తాజాగా తమిళ హాస్య నటుడు వివేక్ చనిపోయినప్పుడు, మన్సూర్ అలీ ఖాన్ వివేక్ పార్దీవ దేహాన్ని సందర్శించారు. ఆ తరువాత కరోనా వ్యాక్సిన్ కారణంగానే వివేక్ చనిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు. ఓ వ్యక్తి ఆరోగ్యస్థితిని పరీక్షించకుండా, అతనికి షుగర్ , బీపీ పరీక్షలేవీ చేయకుండా కరోనా టీకా ఎలా ఇస్తారని మన్సూర్ అలీ ఖాన్ ప్రశ్నించారు.
అంతే కాదు మాస్క్ ధరించడం వల్ల మనం వదులుతున్న కార్బన్ డైయాక్సైడ్ మనమే పీలుస్తున్నామని, అందువల్ల మాస్కు మనకు హానీ చేస్తున్నట్లే కదా అని వాదించారు. సైడ్ ఎఫెక్స్ట్ లేని ఆయుర్వేద మందులు ఇవ్వకుండా, ప్రభుత్వం ఎందుకు ఇంగ్లీష్ మందులు ఇస్తుందని మన్సూర్ అలీ ఖాన్ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీతో పాటు, రాజకీయవర్గాల్లోను చర్చనీయాంశమయ్యాయి. ఇక ఇప్పుడిలా మన్సూర్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలవ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన్సూర్ అలీ ఖాన్ తమిళ సినిమాలతో పాటు తెలుగులో ముఠామస్త్రీ, సాంబ తదితర చిత్రాల్లో నటించారు.