Pokiri Special Show: చరిత్రకి బలం ఎక్కువ. ఎన్నో అద్భుతాలను తనలో కలిపేసుకోవడం దానికి అలవాటు. చలనచిత్ర రంగంలోని ఎన్నో అద్భుతాలు కూడా ఇలా కాలగమనంలో కలిసిపోయాయి. అయితే.. కాలంతో సంబంధం లేకుండా, తరాల మార్పుని తలదన్ని.. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ప్రేక్షకుడు ఇది మా సినిమారా అని కాలర్ ఎగరేసి చెప్పకోగల అత్యద్భుతమైన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. 75 ఏళ్ళ తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి, "ఎవడు హిట్ కొడితే తెలుగు సినిమా చరిత్రకి మైండ్ బ్లాక్ అవుద్దో".. ఆడే కృష్ణగారి అబ్బాయ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అని నిరూపించిన చిత్రం "పోకిరి". "నిజం" ప్లాప్, "నాని" ప్లాప్, "అర్జున్" ప్లాప్, "అతడు" సినిమా బాగున్నా ఆడాల్సినంత ఆడలేదు. మహేశ్ బాబు పని అయిపోయిందా? కృష్ణ కొడుకులో సత్తా అయిపోయిందా? ఇలాంటి మాటలు పుట్టుకొస్తున్న సమయం అది. మహేశ్ బాబు అవన్నీ వింటున్నాడు. అన్నిటిని గమనిస్తున్నాడు. కానీ.., వేటికి రెస్పాండ్ కావడం లేదు. ఎందుకంటే "పోకిరి" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతో ఆ నోర్లు అన్నిటికి పర్మినెంట్ గా లాక్ పడబోతుందని మహేశ్ కి తెలుసు. 2006 ఏప్రిల్ 28న పోకిరి ధియేటర్స్ లోకి వచ్చింది. ఫస్ట్ డే నెగిటివ్ టాక్. సినిమా బాగుంది కాని... అంటూ యాంటీ ఫ్యాన్స్ దీర్గాలు తీయడం స్టార్ట్ చేశారు. కానీ.. తొలివారం తరువాత పోకిరి పుంజుకుంది. ఆ తరువాత పోకిరి కలెక్షన్స్ ఒక సునామిగా మారిపోయాయి. ఎక్కడ పట్టినా హౌస్ ఫుల్ బోర్డ్స్. పూరి డైలాగులు ధియేట్ర్స్ లో బాంబ్ లా పేలాయి. మహేష్ లుక్, యాక్టింగ్, ఫైటింగ్స్, డ్యాన్స్, ఆటిట్యూడ్ అన్నీ సూపర్బ్. ఘట్టమనేని రక్తంలో ఉండే పవర్ ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. మహేశ్ కొట్టిన ఈ సక్సెస్ చూసి అప్పట్లో కుర్ర హీరోలకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కనీసం ఊహించడానికి కూడా సాహసం చేయలేనంత పెద్ద హిట్ అయ్యి కూర్చుంది పోకిరి. 10 నుంచి 12 కోట్ల బడ్జెట్తో రూపొందిన పోకిరి మూవీ అప్పట్లో రూ.70 కోట్ల వరకు వసూలు చేసింది. మొత్తం రూ.40 కోట్లు షేర్. అప్పటి వరకు తెలుగు సినిమా రేంజ్ అంటే రూ. 25 కోట్లు అంతే. రూ. 30 కోట్లు కలెక్ట్ చేస్తే అది మహా అద్భుతం. అప్పుడు హైయ్యస్ట్ టికెట్ ధర 30 రూపాయలు. వాటితోనే పోకిరి రూ.70 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పాన్ ఇండియా హిట్స్ అని చెప్పుకొంటున్న చిత్రాలను మించిన కలెక్షన్ అది. ఇక 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఇంత పెద్ద హిట్ అయ్యేలా పోకిరిలో ఏముంది? 16 సంవత్సరాల తరువాత కూడా స్పెషల్ షో టికెట్స్ కోసం తన్నుకునేంత క్రేజ్ ఎలా సాధ్యం అయ్యింది అంటే.. దాని వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. "ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య.. బులెట్ దిగిందా లేదా"?, "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను", టైల్స్ ఏస్తున్నారట కదా? శృతి నాదే, రివాల్వర్ నాదే లాంటి డైలాగులు, మణిశర్మ మ్యాజికల్ మ్యూజిక్, ఇలియానా అందాలు, పూరి మాస్ డైరెక్షన్, మహేశ్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్.. అన్నిటికి మించి ఆ క్లైమ్యాక్స్ ట్విస్ట్ పోకిరి స్థాయిని అమాంతం పెంచేశాయి. "కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ 57th బ్యాచ్, బ్యాచ్ నెంబర్ 32567. ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్, టాపర్ ఇన్ ది బ్యాచ్" అంటూ ట్విస్ట్ రివీల్ అవ్వగానే.. మహేశ్ ను పోలీస్ డ్రెస్ లో చూసి ధియేటర్స్ మోత మోగిపోయాయి. ఇదెక్కడి ట్విస్ట్ రా మావ అంటూ.. ఫ్యాన్స్ పూనకాలతో రెచ్చపోయిన క్షణాలు అవి. తమిళంలో విజయ్, హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో దర్శన్.. అంతా పోకిరి రీమేక్ కోసం పూరీ ముందు క్యూ కట్టారు. అటు బెంగాలీ, బంగ్లాదేశ్లో కూడా పోకిరి డబ్ అయ్యింది. అలా ఇండియాలో మాత్రమే కాదు, బయట దేశాల్లో కూడా పోకిరి రీ సౌండ్ గట్టిగా వినిపించింది. పాన్ ఇండియా అనే మాటకి స్పెల్లింగ్ తెలియకముందే.. పోకిరి సృష్టించిన చరిత్ర ఇదంతా. ఇప్పటిలా అప్పుడు ఈ సోషల్ మీడియా ప్రభావం ఉండుంటే పోకిరి మ్యానియా ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఇందుకే పోకిరి అంటే మహేశ్ అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులు అందరికి ప్రత్యేకం. 16 ఏళ్ళ క్రితమే ఇలా పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన పోకిరి అంటే అందరికి అభిమానం. పోకిరి వెనుక ఇంత కథ ఉంది కాబట్టే.. ఇప్పుడు పోకిరి స్పెషల్ షోలకి ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. సో.. పోకిరి ఈజ్ నాట్ ఏ మూవీ. ఇట్స్ ఏ ఎమోషన్. ఇవి కూడా చదవండి : Kantamaneni Uma Maheswari: ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్ట్.. ఎలా చనిపోయిందో వెల్లడించిన డాక్టర్లు!