పుష్ప-1 vs కేజీఎఫ్-2! పోటీలో గెలుపు ఎవరిది?

కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం ఆవుతోన్నాయి. ఇక వ్యాపార వర్గాలకి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. దీనికి తెలుగు సినీ పరిశ్రమ అతీతం కాదు. మొదటి వేవ్ నుండి కూడా ఇండస్ట్రీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఆ కష్టాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాల విడుదల విషయంలో చాల కన్ఫ్యూజన్ నెలకొంది. దర్శక ధీరుడు రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీని ఎప్పటి నుండి చెక్కుతున్నాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది దసరాకి మూవీ రిలీజ్ ఖాయం అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చి షూటింగ్స్ కి బ్రేక్ వేసింది. సో.., దసరా రేస్ నుండి కూడా ట్రిపుల్ ఆర్ తప్పుకున్నట్టే. నిజానికి దసరాకి ఇంకొన్ని పెద్ద సినిమాలు రావాల్సి ఉన్నా.., ఆర్.ఆర్.ఆర్ తో పోటీ పడటం ఇష్టం లేక అన్నీ తమ ప్లాన్స్ మార్చుకున్నాయి. కానీ.., ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పక్కకి పోవడంతో దసరా స్లాట్ పై కేజీఎఫ్-2 కన్ను పడింది. నిజానికి ఈ చిత్రాన్ని జూలై 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. అధికారికంగా ప్రకటించనప్పటికీ ‘కేజీఎఫ్’ పార్ట్ 2 వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. కేజీఎఫ్-2 షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వరకు చాలా వరకు పూర్తి అయిపోయింది. దీనితో దసరాకి ప్రేక్షకుల ముందుకి వస్తే బాక్సాఫీస్ ని కుమ్మేయవచ్చు అన్నది రాఖీ బాయ్ ప్లాన్. కానీ.., సరిగ్గా ఇక్కడే ఐకాన్ స్టార్ బన్నీ రంగంలోకి రాబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రాన్ని ముందుగా ఆగస్ట్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ.., ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ అనుకున్నంత సజావుగా సాగడం లేదు. ఇప్పటికే పుష్ప షూట్ రెండు సార్లు క్యాన్సిల్ అయ్యింది. పైగా.., ఇంకా చాలా భాగం షూటింగ్ మిలిగి ఉంది. ఇక ఇప్పట్లో షూట్ మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కానీ.., పుష్ప మూవీని రెండు పార్ట్స్ గా విడుదల చేయాలన్న నిర్ణయం మేకర్స్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. కనీసం ఇక్కడి నుండి అయినా.., అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘పుష్ప-1’ ను దసరా రేస్ లో నిలపొచ్చు. మేకర్స్ కూడా ఈ దిశగానే ఆలోచనలు చేస్తున్నారట. సో.. దసరా రేస్ లో పుష్ప-1 vs కేజీఎఫ్-2 పోటీ ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.