బాహుబాలితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ బ్యూటీ ‘నోరా ఫతేహీ’. అందం, అభినయం, నృత్యంతో ఎంతో మంది అభిమానులను పొందింది. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో మెరిసిన ఈ తార.. దక్షిణాది భాషల్లోనూ ఐటం సాంగ్స్‌తో ఆకట్టుకుంటోంది. అందమే కాదు.. తన నటనతోనూ అభిమానులను ఫిదా చేసింది. ‘పుష్ప’ సినిమాలో ప్రత్యేక గీతాని రూ.2 కోట్లు డిమాండ్ చేసి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా నోరా ఫతేహీ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి సినిమాకి సంబంధించి కాదులెండి. మనీలాండరింగ్ కేసులో ఈడీ నోరాకు నోటీసులు జారీ చేయడంతో మరోసారి ఈ పేరు బాగా వినిపిస్తోంది.
గత నెలలో బాలీవుడ్‌లో ఒక పెద్ద మనీలాండరింగ్ స్కామ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంబంధాలు ఉన్నాయంటూ జాక్వలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసులో ప్రధాన నిందితుడు కనార్హ్ సుకేశ్ చంద్రశేఖర్ కాలర్ ఐడీ స్పూఫింగ్‌తో జాక్వలిన్‌తో సంప్రదించాడని ఈడీ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు తాజాగా నోరా ఫతేహీకి కూడా సంబంధాలున్నాయంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఒక్క మనీలాండరింగ్ కేసులోనే కాదు.. తాజాగా బాలీవుడ్‌లో దుమారం రేపిన డ్రగ్స్ కేసులోనూ ఈడీ నోరా ఫతేహికి నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ బాద్‌షా కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుతో డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈడీ మనీలాండరింగ్, డ్రగ్స్‌కేసు రెండింటిలో నోరాకి నోటీసులివ్వడం చర్చ మరింత ఎక్కువైంది. ఆమెను విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.