బాలకృష్ణతో మోహన్ బాబు కీలక భేటీ!

గత కొన్ని రోజులుగా ‘మా’ ఎన్నికల సంగ్రామం ఎంత రసవత్తరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆదివారం జరిగిన పోలింగ్ లో మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే మా ఎన్నికలు ముగిసన తర్వాత రగడ కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ ఇంటికి మోహన్ బాబు, మంచు విష్ణు వచ్చారు.

manchgu minఎన్నికలకు ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలను మోహన్ బాబు బాలకృష్ణకు వివరించినట్లు తెలిసింది. అరగంట నుంచి బాలకృష్ణ, మోహన్ బాబు, విష్ణు మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ‘మా’ సంక్షేమం కోసమే బాలకృష్ణతో భేటీ అయినట్టు సమాచారం. అయితే మా ఎన్నికలకు ముందు మద్ధతు కోసం వెళ్లిన విష్ణు ఎన్నికల ఫలితం అనంతరం వెళ్లి తనకు మద్ధతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంచు మోహన్ బాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో బాలయ్య అల్లుడు లోకేష్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని, ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో మంగళగిరిలో టీడీపీ ఓటమికి కారణం తాను కూడా కావొచ్చని అన్నారు. కానీ, ఇవన్నీ మనసులో ఏమీ పెట్టుకోకుండా బాలకృష్ణ మా ఎన్నికల్లో విష్ణుకి ఎంతో అండగా నిలిచారని.. ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానని చెప్పారు.

ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. నా తండ్రి సపోర్ట్ ఎలా ఉంటుందో.. బాలకృష్ణ సపోర్ట్ కూడా నాకు కావాలి.. ఆయన ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ తో మోహన్ బాబు కి ఎంతో మంచి సంబంధాలు ఉండేవి. ఇండస్ట్రీలో మోహన్ బాబుకి వెన్నుదన్నుగా నిలిచారు ఎన్టీఆర్. ఆయన నటించిన చాలా చిత్రాల్లో పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అందుకే ప్రతి మీటింగ్ లో అన్న ఎన్టీఆర్ అంటూ తప్పకుండా ప్రస్తావిస్తారు మోహన్ బాబు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కి దూరమయ్యారు మోహన్ బాబు. ‘మా’ ఎన్నికల తర్వాత మళ్లీ బాలకృష్ణతో మంచు ఫ్యామిలీ సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు సిద్దమైనట్లు కనిపిస్తుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.