మానవత్వం పరిమళించే మంచి మనసుకు ”వీడ్కోలు”!..

అభ్యుదయ కవి అదృష్ట దీపక్‌ కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి నంది అవార్డు పొందారు. నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్‌. ఏడేళ్ల వయస్సులో గాయకుడిగా, తొమ్మిదేళ్ల వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ల వయస్సులో రచయితగా కళా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తమ కవిగా, ఉత్తమ కథా రచయితగా, ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. బెర్ర్టోల్డ్‌ బ్రెహ్ట్‌, పేబ్లో నెరుడాల కవితలను తెలుగులోకి అనువదించారు. 1980లో మాదాల రంగారావు సారథ్యంలో వచ్చిన ‘యువతరం కదిలింది’ చిత్రంలో ‘ఆశయాల పందిరిలో’ గీత రచనతో సినిమా రంగంలో ప్రవేశించి నలభైకి పైగా ప్రగతిశీల పాటలు రాశారు. నేటి భారతం సినిమాలో ఆయన రాసిన ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ అద్భుతం. తన సినిమా పాటల సంపుటి ‘ఆశయాల పందిరిలో’ మహాకవి శ్రీశ్రీకి అంకితమిచ్చారు.

5

నేటి భారతం’లో నంది అవార్డు గెలుచుకున్న ‘అర్ధరాత్రి స్వతంత్రం–అంధకార బంధురం’ గీతాన్ని అనారోగ్యంతో మంచం మీద ఉన్న శ్రీశ్రీతో దగ్గరుండి రాయించారు దీపక్‌. శ్రీశ్రీ సాహిత్యంపై దాడి చేసే అభ్యుదయ విచ్ఛిన్నకర శక్తులపై తన కలాన్ని కత్తిలా ఝళిపిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. శ్రీశ్రీపై దీపక్‌ రచనలను ‘శ్రీశ్రీ ఒక తీరని దాహం’ పేరున పుస్తక రూపంలో ‘శ్రీశ్రీ సాహిత్య నిధి’ ప్రచురించింది. ఇలా ప్రగతిశీలంగా పని చేసిన అభ్యుదయ రచయిత కరోనాతో పోరాడుతూ కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.