ఐపీఎల్ 2022లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాడ్ఫామ్ కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా అవుట్ అయిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి కొద్దిలో బతికిపోయాడు. ట్రెంట్ బోల్ట్ వేసిన తొలి ఓవర్ మూడో బంతిని కోహ్లీ షార్ట్ స్క్వైర్లెగ్లోకి ఆడాడు. అక్కడే ప్రత్యేకంగా కోహ్లీ కోసం సెట్ చేసిన ఫీల్డర్ మిచెల్ చేతుల్లో బంతి పడింది. కానీ.. కోహ్లీ అదృష్టం కొద్ది ఆ బంతి చేతుల్లో పడేముందు నేలకు తాకింది. దీంతో మరోసారి డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి కోహ్లీ కొద్దిలో తప్పించుకున్నాడు.
ఆ తర్వాత బంతిని కోహ్లీ అద్బుతమైన షాట్‌తో ఫోర్ కొట్టాడు. ఐదో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ వెనుకనుంచి బౌండరీకి వెళ్లింది. చివరి బంతికి సింగిల్ వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తర్వాతి ఓవర్ 4వ బంతికి కోహ్లీ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10 బంతుల్లో 9 పరుగులు చేసి కోహ్లీ.. మరోసారి నిరాశ పరుస్తూ.. అవుట్ అయ్యాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీకి అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు దక్కింది. కోహ్లీ రాణించాలని క్రౌడ్ అంత కోరుకుంది. ఈ అభిమానమే కోహ్లీని కొంత ఒత్తిడికి గురిచేసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు మ్యాచ్‌లలో గోల్డెన్ డక్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ.. ఎలా ఆడుతాడో అనే ఆసక్తి నెలకొంది.దీంతో కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతిని స్టేడియంలో అభిమానులు ఊపిరి బిగబట్టి చూశారు. మూడో బంతికి అవుట్ అయ్యాడేమో అనే అనుమానంతో షాక్‌లోకి వెళ్లారు. అవుట్ కాకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు. ఫోర్ కొట్టినప్పుడు కొంత రిలాక్స్ అయ్యారు. తర్వాతి బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో మళ్లీ ఉలిక్కిపడ్డారు. ఇలా కోహ్లీ ఆడుతున్నంత సేపు ప్రేక్షకులు ఎదో తెలియని ఆందోళనతో చూశారు. చివరికి వారి భయమే నిజమైంది. కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుట్ అయ్యాడు. పుల్ షాట్ ఆడబోయి మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది. రియాన్ పరాగ్ అద్భుతంగా డైవ్ చేస్తూ.. క్యాచ్ తీసుకోవడంతో కోహ్లీ ఇన్నింగ్స్‌కు, అభిమానుల టెన్షన్‌కు పుల్‌స్టాప్ పడింది.
నిజానికి కోహ్లీ ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడేందుకు అతి జాగ్రత్త, ఒత్తిడి ప్రధాన కారణాలని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. లీగ్ మ్యాచ్‌లే కదా అని కొంత ఫ్రీగా ఆడితే ఫలితం ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఆడాలనే ఒత్తిడిలోనే కోహ్లీ అవుట్ అవుతున్నట్లు తెలుస్తుంది. మరి కోహ్లీ ఎదుర్కొంటున్న ఈ బ్యాడ్ టైమ్‌పై, కమ్‌బ్యాక్ అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తన ఓవర్లో రెండు సిక్సులు కొట్టిన పరాగ్‌తో గొడవకు దిగిన హర్షల్ పటేల్
What advice would you give to Virat Kohli right now?#IPL2022 #RCBvRR pic.twitter.com/O64zBMPyv5
— ESPNcricinfo (@ESPNcricinfo) April 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.