ఒకప్పుడు పెళ్లి అంటే ఐదు రోజుల పాటు జరిగే వేడుక. ఆ తర్వాత అది కాస్త గంటల వ్యవధికి వచ్చింది. కాలం మారుతున్న కొద్ది.. కొన్ని సంస్కృతులు కనుమరుగయితే.. కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అలా మన తెలుగు వివాహ వేడుకల్లో కూడా కొన్ని కొత్త ఆచారాలు వచ్చి చేరాయి. ఇప్పుడు తెలుగు పెళ్లిల్లో కూడ హల్దీ, మెహందీ, సంగీత్ తప్పనిసరి తంతు అయ్యాయి. కొందరికి ఇవి ఆర్భాటం కాగా.. మరి కొందరికి ఆర్థికంగా ఇబ్బందిగా మారాయి. ఇక వీటితో పాటు ప్రస్తుతం ప్రీవెడ్ షూట్ కూడా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది.
గతంలో పెళ్లి వేడుక జరిగేటప్పుడు మాత్రమే ఫోటోలు తీసేవారు. కానీ ఇప్పుడు వివాహానికి ముందే ప్రీ వెడ్ షూట్ పేరుతో ఫోటో సెషన్ నిర్వహిస్తున్నారు. జీవితంలో పెళ్లి అంటేనే మధురమైన జ్ఞాపకం కాబట్టి.. దాన్ని ఫోటోల రూపంలో బంధించి.. భద్రంగా దాచుకోవడం తప్పులేదు. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని ప్రీవెడ్ షూట్ లలో కొందరు మరి అత్యుత్సాహం ప్రదర్శించి.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నారు. ఈ కోవకు చెందని ప్రీ వెడ్ షూట్ ఒకటి తాజాగా వార్తల్లో నిలిచింది.
ప్రస్తుతం సోషల్ మీడియో ఓ ప్రీవెడ్ షూట్ కి చెందని ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. వీటిల్లో కాబోయే దంపతులు బురదలో పొర్లుతూ.. ఫోటోలకు ఫోజులిచ్చారు. మడ్ రొమాన్స్ పేరుతో ఈ ఫోటోలు తెగ వైరలవుతున్నాయి. అయితే ఇది ఇండియాలో జరిగిన ఫోటో షూట్ కాదట. శ్రీలంకకు చెందిన కాబోయే దంపతులు ఇలా వెరైటీగా బురద పొలాల్లో ప్రీవెడ్ ఫోటో షూట్ నిర్వహించారని తెలుస్తోంది. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇలా పొలాల్లోని బురదలో ప్రీవెడ్ ఫోటో షూట్ నిర్వహించరట. తాము మట్టి మనుషులమని.. మట్టితో తమకు విడదీయలేని అనుబంధం ఉందని చెప్పడం కోసమే ఇలా బురదలో ప్రీ వెడ్ ఫోటో షూట్ చేశారని తెలుస్తోంది.
వీరి ఉద్దేశం మంచిదే అయినప్పటికి.. ఫోటోలు కొంచెం ఇబ్బందిగా ఉండటంతో నెటిజనుల వీరిని ఏకిపారేస్తున్నారు. ‘‘పందుల్లా అలా బురదలో ఒకరి మీద ఒకరు పడి దొర్లితే మీరు మట్టి మనుషులా’’.. ‘‘ఇదేం పిచ్చి.. ఇలాంటి చెత్త ఐడియాలు ఎలా వస్తాయి’’ అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఓ జంట ఇలానే ఒంటి మీద సరైన బట్టలు లేకుండా దుప్పట్లు కప్పుకుని ప్రీవెడ్ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. వీరిపై కూడా ఓ రేంజ్ లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ప్రీ వెడ్ షూట్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.