సాధారణంగా కరోనా నియంత్రణకు మనం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఎనిమిది డోసులు తీసుకున్నాడు. అది కూడా నకిలీ ఐడీ కార్డులు చూపించి మరీ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. విచిత్రం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్న వారి పేరుపై కూడా ఇతనే వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అందుకుగాను.. వారి నుంచి డబ్బులు కూడా తీసుకోవడం విశేషం. ఈ తతంగం అంతా జరిగింది బెల్జియం దేశంలో. తన వ్యాక్సిన్‌తో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారి డోసులు కూడా వేయించుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వేరే వారి ఐడీలు చూపించి 8 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తిని 9వ సారి అలాగే ప్రయత్నించగా.. గమనించిన వ్యాక్సినేషన్ సెంటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. 8 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అతనికి ఏమీ కాలేదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదంట. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.