తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా అందులో ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. గతంలో పోలీసులకు సరికొత్త వాహనాలను అందించి సీఎం సాబ్ శభాష్ అనిపించుకున్నారు. కట్ చేస్తే.., ఇప్పుడు రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు సరికొత్త కియా కార్స్ అందించారు కేసీఆర్. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు కష్టపడి పని చేయాలని.., ఈ విషయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో సీఎం కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు.
సమీక్ష అనంతరం రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు కియా కంపెనీ కి చెందిన కార్లను అందించింది సర్కార్. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో కియా కారు విలువ రూ.24.95 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమనికి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడా జెండా ఊపి ఈ కార్లను ప్రారంభించారు. దీంతో పాటు.., స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అదనపు కలెక్టర్కు తక్షణమే రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిజానికి పల్లెలు, పట్టణాలను ప్రగతిపథంలో నడిపించేందుకు జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కంకణబద్ధులు కావాలని కేసీఆర్ గతంలోనే పిలుపు ఇచ్చారు. ఇందుకోసం గ్రామ సభలు ఏర్పాటు చేసుకోండి, కార్యదర్శులు, సర్పంచులను ప్రజా క్షేత్రంలోకి పంపండి. పని చేయని సర్పంచులు ఎవరైనా సరే.., అధికార పార్టీకి చెందిన వారైనా చర్యలు తీసుకోండి అని కేసీఆర్ తెలియచేశారు. అదనపు కలెక్టర్లుకు సీఎం ఇంత స్వేచ్ఛ ఇచ్చినా ఫలితాలు రాకపోవడంతో కేసీఆర్ ఈ అత్యవసర మీటింగ్ జరిపినట్టు తెలుస్తోంది.
ఈ నెల 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో, 21న వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్ల పని తీరుని తనిఖీ చేయనున్నారు. ఒకవైపు నిధులు మంజూరు చేసి. కొత్త వాహనాలు అందచేసి, మరోవైపు తనిఖీలు కూడా ఉంటాయని సీఎం స్పష్టం చేయడంతో అధికారులలో చలనం మొదలైంది. సీఎం పర్యాటనకి ఇంకా 10 రోజులు సమయం ఉండటం అదనపు కలెక్టర్స్ ఇప్పుడు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి.., పల్లెలు, పట్టణాల అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాల వివరాలను సేకరిస్తున్నారు. మరి.. కేసీఆర్ అదనపు కలెక్టర్స్ కి కియా కార్స్ అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.