డిగ్రీ విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి కల్పించే కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఏడాది (2023–24) నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఏంటా కోర్సులు..? ఎలా శిక్షణ ఇస్తారు..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. సరైన ఉద్యోగ, ఉపాధి లేకపోవటం అందుకు ప్రధాన కారణమైనా, విద్యార్థుల వచ్చిరాని చదువులు కూడా అందుకు ఒక కారణమే. ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే చాలు అన్నట్లుగా చదటవం విద్యార్థులకు ఉపాధి దొరక్కపోవటానికి ప్రధాన సమస్య అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు చుదువుతో పాటు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది (2023–24) నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.
విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశ పెడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా స్కిల్ డెవలప్‌మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులను అందించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయమై చర్చించేందుకు ఈనెల 28న 100 కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో పూర్తి ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమలుకానున్నట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థి తప్పకుండా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేలా కోర్సులను రూపొందిస్తున్నారు. డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలో ఇంటర్న్‌షిప్‌ను అందుబాటులోకి తేనున్నారు.
మొత్తం 14 నైపుణ్య కోర్సులకు ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రిటైల్ మేనేజ్‌మెంట్, క్రియేటివ్ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి. ఈ స్కిల్ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. మొదరటి ఏడాది నుంచే స్కిల్ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి శిక్షణ ఇచ్చేలా మరో విధానం తీసుకురానున్నారు. వారానికి 3 రోజులు తరగతులు…3 రోజులు ఆయా పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆ సమయంలో వారికి రూ.10 వేల వరకూ ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలు ఉండగా, తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఈ నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని అధికారులు చెప్తున్నారు.