ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో జరుగుతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు సైతం రోడ్డు ప్రమాదాల్లో మరణించడం, తీవ్రంగా గాయపడటం జరుగుతుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ అధికారులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్యను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళితే..
తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని శృంగేరీ పీఠ సందర్శనకు వెళ్తుండగా మంగుళూరు సమీపంలో మూడురు-నల్లూరు క్రాస్ వద్ద శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైర్ బ్లస్ట్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కరెంట్ స్తంబానికి ఢీకొంది. అయితే డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని మరో వాహనంలో శృంగేరీకి పంపించారు.
రోహిత్ రెడ్డికి ప్రమాదం జరిగిందన్నవిషయం తెలియగానే కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. కాకపోతే ఆయనకు ఏటువంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు శనివారం ఉదయం యాక్సిడెంట్ అయినట్లు వస్తున్న వార్తలు నిజమే అని.. అయితే ప్రజల ఆశీర్వాదం వల్ల తాను క్షేమంగా ఉన్నానని.. ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు కాలేదని అంతా దేవుడి దయ అని అన్నారు. ఇదంతా తాండూరు ప్రజలందరి ప్రేమానురాగాలే అని… అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందవొద్దని కోరారు.