రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగైన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర తేదీలు ఖరాయ్యాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు.
తెలంగాణ కుంభమేళా, రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగైన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర తేదీలు ఖరాయ్యాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర తేదీలను ఆలయ పూజారులు ప్రకటించారు. కొండ కోనల్లో గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశవ్యాప్తంగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి విచ్చేస్తారు. ఎంతో కోలాహాలంగా జరిగే ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
వచ్చే ఏడాది(2024) ఫిబ్రవరిలో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. జాతరలో భాగంగా మాఘ శుద్ధ పంచమి నాడు అనగా ఫిబ్రవరి 14న బుధవారం మండ మెలిగే పండుగను నిర్వహించనున్నారు. అదే రోజు గుడి శుద్ధీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 21వ తేదీన సాయంత్రం 6 గంటల తరువాత సారలమ్మను, పగిడిద్దరాజును, గోవిందరాజును గద్దె వద్దకు తీసుకువస్తారని, ఫిబ్రవరి 22వ తేదీన గురువారం సమ్మక్క తల్లి గద్దెపైకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఇక ఫిబ్రవరి 23 శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని, ఆపై ఫిబ్రవరి 24వ తేదీన వనదేవతలను సమ్మక్క-సారలమ్మల వన ప్రవేశం చేస్తారని ఆలయ పూజారులు వెల్లడించారు. ఇక చివరగా ఫిబ్రవరి 28వ తేదీన మాఘ శుద్ధ బహుళ పంచమి నాడు తిరుగు వారం పండుగను నిర్వహించనున్నట్టు పూజారులు పేర్కొన్నారు.