సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జలగం సుధీర్, సుష్మా కల్లెంపూడి దంపతులు అమెరికాలో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్లుగా పనిచేశారు. ‘సంపాదనకు విరామం – సమాజానికి సహాయం’ అనే నినాదంతో ఉద్యోగాలకి రాజీనామా చేసి భారత్‌కు తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ తగ్గించేందుకు జలగం సుధీర్ గ్రీన్ ఎనర్జీ పేరిట ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రమోట్ చేసే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో సుష్మాకు ఓ ఆలోచన తట్టింది. తాను చదువుకున్న రోజులతో పాటు ఉద్యోగం చేస్తున్నప్పుడు టాయిలెట్లు లేక హైదరాబాద్‌లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మొబైల్ షీ టాయిలెట్ రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు.
నగరంలో లక్షలాది మంది నిత్యం ఉద్యోగాలు, పనుల కోసం ఒకచోటి నుంచి మరొకటి చోటికి ప్రయాణాలు చేస్తుంటారు. అనేక ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా తిరుగుతుంటారు. ఇలాంటి చోట్ల టాయిలెట్లను గుర్తించడం ప్రజలకు చాలా కష్టమైన పనిగా మారింది. వీలైనంత వరకు ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నా సరిపోవడం లేదు. అందులోనూ పరిశుభ్రత కూడా టాయిలెట్లలో సమస్యగా మారింది.
ముఖ్యంగా టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు సుష్మా కల్లెంపూడి నూతన ఆవిష్కరణను తీసుకొచ్చారు. మొబైల్ షీ టాయిలెట్స్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. అధునాతన రీతిలో టాయిలెట్లను ఆటో రిక్షాల్లో ఏర్పాటు చేసి.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో క్లీన్‌గా ఉండే టాయిలెట్ల సదుపాయాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పరిశుభ్రంగా ఉండే టాయిలెట్లు దొరకక నిత్యం వేలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ ఆలోచన చేశానని సుష్మ చెప్పారు. జీహెచ్ఎంసీ, టీఎస్ఆర్టీసీ కూడా పాత వాహనాల్లో ఈ కాన్సెప్ట్‌ను వినియోగించి మొబైల్ వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఈ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని నిలుపుతారు.
వాహనం చిన్నగా ఉండడంతో వీటిని పార్క్ చేయడం కూడా ఎంతో సులభం. ప్రతీ మొబైల్ షీ టాయిలెట్‌ను మహిళలే ఆపరేట్, మెయింటెనెన్స్ చేస్తారు. సుష్మా భర్త సుధీర్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ బిజినెస్‌లో ఉండడంతో షీ టాయిలెట్లను ఏర్పాటు చేయడం ఆమెకు సులువైంది. ఫ్లష్, వాష్‌బేసిన్, 100 లీటర్ల డ్రైనేజీ సిస్టం ఉండే ఈ మొబైల్ టాయింట్ల తయారీ ఒక్కొక్కటికి రూ.4లక్షల ఖర్చవుతుంది.
అలాగే మొబైల్ టాయిలెట్ ఏ ప్రాంతంలో ఉందో గుర్తించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు సుష్మా చెప్పారు.