నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతూ గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. పెట్టుబడులకు అనువైన నగరం కావడంతో ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలన్నీ హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని పొరుగు రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ట్రాఫిక్ రద్దీ తలకు మించిన భారంగా మారింది. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి సమస్య తీరడం లేదు. ప్రభుత్వం కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతూ ట్రాఫిక్ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది. ఇదిలావుంటే గచ్చిబౌలి ప్రాంతంలో చేపట్టనున్న ఫ్లైఓవర్ కారణంగా ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గచ్చిబౌలి ప్రాంతంలో ఐటి కంపెనీలు ఎక్కువుగా ఉండడంతో ఆ రూట్లలో ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావునా వాహనదారుల సౌకర్యం కోసం గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలో ఓ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిని 3నెలలపాటు మూసివేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ ను మరో దార్లలో మళ్లిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలు మే 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని కోరారు.