గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ ఆరా తీశారు.
ఈ ఉదయం వీ హనుమంతరావును జగ్గారెడ్డి కలిసి పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. ఈ క్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. జగ్గారెడ్డి ఎంతగా కిషన్ ని పక్కకు జరిపినా తనకు మాట ఇచ్చే వరకు వదలబోనని కాళ్లను అలాగే పట్టుకున్నారు. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.