ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్లాస్టీక్ ని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నాం. ప్లాస్టీక్ సంచుల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు ఉందని తెలిసినా కూడా దాని వాడకం మాత్రం తగ్గించలేకపోతున్నాం. ప్రభుత్వం ప్లాస్టీక్ నిషాదాన్ని అమలు చేస్తున్నా.. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్లో ప్లాస్టీక్ సంచులు లేనిదే గడవని పరిస్తితి.
ప్లాస్టిక్ అనేది రసాయన సమ్మిళిత పదార్థము. ప్లాస్టీక్ కాలుష్యం వలన పర్యావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. కాలుష్యం కారణంగా తరుచూ వరదలు, భూకంపాలు, భూతాపం అకస్మాత్తుగా పెరిగిపోవడం జరుగుతుంది. సముద్రాల్లో జీవించే చేపలు.. ఇతర జలచర జీవులు చనిపోతున్నాయి. భూమిపై పడవేసే ప్లాస్టీక్ సంచులు, వ్యర్థాలు తిని కొన్ని జంతువులు చనిపోతున్నాయి. ప్రభుత్వం ప్లాస్టీక్ సంచులను వాడకూడదు అని ఎన్ని ఆంక్షలు విధించినా.. నిత్యం ప్లాస్టీక్ సంచుల వాడకం మాత్రం తగ్గడం లేదు. పైగా వీటి వాడకం ప్రతిరోజూ పెరిగిపోతూనే ఉంది.. అందుకే ప్లాస్టీక్ సంచుల పరిశ్రమలు కూడా పెరిగిపోతున్నాయి.
భూమిపై పెరిగిపోతున్న కాలుష్యంతో మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్లాస్టీక్ సంచుల వాడకం తప్పడం లేదు. ప్లాస్టీక్ ని నిర్మూలించాలి.. ప్లాస్టీక్ సంచుల వాడకాన్ని నిషేదించాలని ఎంతగా చెబుతున్నా ఆచరించడంలో మాత్రం ఎవరూ ఉత్సాహం చూపించడంలేదు.. దాంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నతీరులో ఉంది. పాల ప్యాకెట్ మొదలు పెడితే.. తినే ప్లేట్ల వరకు అన్నీ ప్లాస్టీక్ తో చేసినవే. షాపింగ్ కాంప్లెక్స్, సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఎక్కడికి వెళ్లినా ప్లాస్టీక్ సంచుల వాడకం తప్పడం లేదు. ఇప్పటికే ప్లాస్టీక్ వాడకం వల్ల భూమికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంత చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం మారడం లేదు. తాజాగా ప్లాస్టీక్ నిర్మూలనకు జీహెచ్ఎంసీ సరికొత్త మిషన్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ బ్యాగ్స్ చూసి అందరూ భలే బాగుందే అని మెచ్చుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ ఏటీబీ.. అంటే ఎనీ టైమ్ బ్యాగ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐడీపీఎల్ పండ్ల మార్కెట్ ఈ మిషన్ ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేశారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణం పరిరక్షణకు కొంత వరకైనా మేలు చేయవొచ్చని జీహెచ్ఎంసీ భావిస్తుంది. మెవాటె, యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఈ బ్యాగ్ మిషన్ ఏర్పాటు చేసింది. మనకు బ్యాగు కావాలంటే మిషన్ లో రూ. 10 నోటు లేదా రెండు ఐదు రూపాయల బిల్లలు వేస్తే కింద నుంచి క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఒకవేల నగదు లేకుంటే మిషన్ పై ఉన్న క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ ద్వారా బ్యాగ్ ని పొందవొచ్చు. ఈ మిషిన్ లో ఒకేసారి 500 బ్యాగ్స్ పట్టే ఏర్పాటు చేశారు.
మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఈ మిషన్ సోలార్ ఎనర్జీ ద్వారా పనిచేస్తుంది. దీనికి కరెంట్ అసరం లేదు.. అంతేకాదు ఈ మిషన్ల ద్వారా మహిళలు కూడా ఉపాది పొందుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సెల్ఫ్ గ్రూప్ మహిళలకు క్లాత్ ఇస్తారు. మహిళలు ఆ క్లాత్ తో బ్యాగులను కుట్టి మిషన్ లో అమర్చుతారు. ఇలా సెల్ఫ్ గ్రూప్ మహిళలకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది. ప్రస్తుతం ఐడీపీఎల్ లో ఒక మిషన్ ఏర్పాటు చేశారు. మరో బ్యాగ్ మిషన్ జేఎన్టీయూ కూరగాయల మార్కెట్ వద్ద పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.