మనిషి జీవితం ఎంతో విలువైనది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఓ మహిళ చనిపోతూ ఏకంగా ఏడుగురికి ప్రాణం పోస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తాను మరణిస్తూ మరో కొంతమందికి ఊపిరి పోసి వారి ప్రాణాన్ని నిలబెట్టింది. బైక్ పై వెళ్తున్న ఆమె ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో బ్రెయిడ్ డెడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యుల మంచి మనసుతో మరో కొంతమంది ప్రాణాలను నిలబెట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పరిధిలోని కృష్ణ మండల. ఇదే ప్రాంతంలో శేషగిరి-వీణా (40) దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఇదిలా ఉంటే ఈ దంపతులు మూడు రోజుల కిందట మక్తల్ కు వెళ్దామనుకున్నారు. దీంతో ఇద్దరూ బైక్ పై బయలు దేరారు. ఇక నల్లగుట్ట మారెమ్మ వద్ద రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి వీరి బైక్ కింద పడింది.
దీంతో ఈ భార్యాభర్తలు ఎగిరి కిందపడ్డారు. శేషగిరి చిన్న చిన్నగాయాలతో బయటపడగా.. వీణ తలకు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆమె భర్త వీణను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. ఇక అటు నుంచి మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ వీణ బ్రెయిన్ డెడ్ తో సోమవారం ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ మహిళ మరణవార్త తెలుసుకున్న ఓ ప్రముఖ స్వచ్చంద సంస్థ.. వీణ అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణం పోసినట్టుగా అవుతుందని ఆమె భర్త శేషగిరికి వివరించారు.
వారి మాటలు విన్న అతడు చివరికి సరేనంటూ ఒప్పుకున్నాడు. అనంతరం ఆ సంస్థ డాక్టర్లు వీణ నుంచి అవయవాలను సేకరించి ఏడుగురికి ప్రాణాలు పోశారు. దీంతో మొత్తానికి వీణ చనిపోతూ ఏకంగా ఏడుగురికి ప్రాణం పోసి కొత్త జీవితాన్ని ఇచ్చిందని పలువురు మెచ్చుకుంటున్నారు. చనిపోతూ మరో ఏడుగురికి ప్రాణం పోసిన వీణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.