ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ పోరు ముగిసింది. క్రికెట్ పుట్టినిళ్ళైన ఇంగ్లాండ్ రెండోసారి పొట్టి ప్రపంచకప్ ను ముద్దాడింది. ఇక టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ద్వైపాక్షిక సిరీసులపైన ద్రుష్టి పెట్టాయి. ఈ క్రమంలో భారత జట్టు, న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ టూర్ లో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుండగా, నవంబర్ 18 నుంచి సిరీస్ ఆరంభం కానుంది. ఇదిలాఉంటే.. భారత జట్టులో జరుగుతున్న తాజా పరిస్థితులపై మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ ఆందోళన వ్యక్తం చేశాడు. జట్టుకు ప్రధాన కోచ్ ఉండగా మరో బ్యాటింగ్ కోచ్ అవసరం లేదని పేర్కొన్నాడు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఆటగాళ్లు గందరగోళానికి లోనవతారని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు సెమీస్ లోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. టోర్నీలో టీమిండియా ప్రదర్శన సంతృప్తి కరంగా లేదన్నది వాస్తవం. విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ మినహా మిగిలిన వారి ప్రదర్శన అంతంత మాత్రమే. ఈ వైపల్యాలపై స్పందించిన టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్, జట్టులో జరుగుతున్న తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. బీసీసీఐ నిర్ణయాలను విమర్శిస్తూనే.. జట్టులో ఆటగాళ్ల కన్నా సపోర్ట్ స్టాఫ్ ఎక్కువవుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
“హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నపుడు.. మరో బ్యాటింగ్ కోచ్ అవసరం లేదు. అతడు ఒకటి చెప్పడం.. మరో కోచ్ మరోకటి చెప్పడం వల్ల బ్యాటర్లు గందరగోళానికి గురవుతారు. ఇకనైనా ఇలాంటి అనాలోచిత నిర్ణయాలకు స్వస్తి పలకాలి. కీలకమనుకున్న వారినే జట్టుతో పర్యటనకు పంపండి. వద్దనుకున్న వారిని పంపకండి. మేం.. 1983 ప్రపంచకప్ ఆడే సమయంలో మా వెంట ఒకే ఒక్క మేనేజర్ ఉండేవాడు. 1985 టోర్నీలోనూ ఒక్కరే ఉన్నారు. అంతేకాదు.. 2011 వరల్డ్ కప్ సమయంలో కూడా పరిమిత సంఖ్యలోనే సపోర్టింగ్ స్టాఫ్ ఉండేవారు. వీరి సంఖ్య ఎక్కువైతే ఎవరి సూచనలు వినాలో తెలియక ఆటగాళ్లు ఇబ్బందిపడతారు..” అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
What is the need of a “Batting coach” (Vikram Rathore), when u already have a great batsman Rahul Dravid as Coach?
– Sunil Gavaskar
— Varun Giri (@Varungiri0) November 14, 2022