పోరాడుతూ ఓడిపోయినా.. గెలిచినట్టే అని అంతా చెప్తారు. కానీ.., చేదు నిజం ఏమిటో తెలుసా? చరిత్ర విజేతని మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. సైఖోమ్ మీరాబాయ్ చాను.. 2021 ఒలింపిక్స్ లో ఇండియాకి తొలి పతకాన్ని సాధించి పెట్టి, ఇప్పుడు విజేతగా నిలిచింది. అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. కానీ.., ఈ స్థితికి చేరడానికి, ఈ విజయాన్ని ముద్దు ఆడడానికి, ఈ పతకాన్ని భరతమాత మెడలో హారంగా మార్చడానికి.. సైఖోమ్ మీరాబాయ్ చాను జీవితంలో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. మరి.. ఒక మహిళా వెయిట్ లిఫ్టర్ గా సైఖోమ్ మీరాబాయ్ చాను సాగించిన ప్రస్థానం ఏమిటో, స్ఫూర్తిని కలిగించే ఆమె కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
సైఖోమ్ మీరాబాయ్ టోక్యో ఒలింపిక్స్ లో.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తొలి రోజే ఇండియాకి రజిత పతకాన్ని అందించి.., దేశం మీసం తిప్పేలా చేసింది. కానీ.., గతంలోకి వెళ్తే ఈమె అనుభవించిన పేదరికం కళ్ళకి కనిపిస్తుంది. సైఖోమ్ మీరాబాయ్ చానుది మణిపూర్ రాష్ట్రంలోని ఓ కుగ్రామం. తినడానికి తిండే కాదు, చేసుకోవడానికి కూలి పని కూడా దొరకని కుటంబం వారిది. వారి జీవితం మొత్తం పక్కనే ఉన్న అడవిపై ఆధారపడి ఉండేది. ఆడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మడం సైఖోమ్ మీరాబాయ్ చాను తండ్రి పని. ఆ కట్టెలను అడవి నుండి ఇంటికి చేర్చే బాధ్యత మీరాబాయ్ అన్నది. కానీ.., ఆ కట్టెల మోపు బరువుని అతను మోయలేక మోస్తూ ఉండేవాడు.
ఒకరోజు అన్నకు సహాయం చేయాలని మీరాబాయ్ ఆ కట్టెల మోపును వీపుకి ఎత్తుకుంది. అస్సలు ఆమెకి బరువు అనిపించలేదు. ఇంకో మోపు, ఇంకో మోపు.. ఇలా మూడు మోపులు వరకు అవలీలగా మోయగలిగింది. అప్పుడే మీరాబాయ్ శక్తి ఆ కుటంబానికి తెలిసి వచ్చింది. దీంతో.., ఊరిలో ఉన్న పెద్దలు మీరాబాయ్ ని వెయిట్ లిఫ్టింగ్ పై ఫోకస్ పెట్టమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళకి ఆ ఆటలో ఉండే మజా మీరాబాయ్ కి తెలిసి వచ్చింది. దీంతో.. ఆమె ఆటని ప్రాణంగా భావిస్తూ వచ్చింది. ఇక మొదటిసారి జాతీయ స్థాయిలో ఆడటానికి గ్రామస్థులు తలా కొంత చందాలు వేసుకుని మీరాబాయ్ కి సహాయం చేశారంటే ఆమె నేపధ్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
జాతీయ స్థాయికి చేరుకున్నాక మీరాబాయ్ ఆటలో రెచ్చిపోయి విజయాలు సాధించింది. 2014 కామన్ వెల్త్ లో రజతం పొందినప్పటి నుండి, రియో ఒలింపిక్స్ ముందు వరకు ప్రతి ఆటలోనూ ఆమెని విజయమే వరించింది. మధ్యలో కొన్నాళ్ళు గాయం ఆమెని ఆటకి దూరం చేసింది. కానీ.., పట్టుదలతో శ్రమించి ఇప్పుడు ఇప్పుడు దేశానికి మీరాబాయ్ ఈ ఒలింపిక్స్ పతకం సాధించి పెట్టింది.
కానీ.. ముందే చెప్పుకున్నాం కదా? చరిత్ర విజేతని మాత్రమే గుర్తు పెట్టుకుంటుందని. మీరాబాయ్ విషయంలో కూడా ముందు ఇదే జరిగింది. ఈ ఒలింపిక్స్ కి ముందు జరిగిన రియో ఒలింపిక్స్ లో ఓటమి తరువాత దేశంలోని క్రీడా పండితులు అంతా మీరాబాయ్ పై విమర్శలు కురిపించారు. ఆమె పని అయిపోయింది అని కామెంట్స్ చేశారు. కానీ.., ఆ ఓటమి నుండి మీరాబాయ్ పాఠాలు నేర్చుకుంది. తనని తాను సరికొత్తగా మార్చుకుంది. ఇప్పుడు ప్రపంచ దేశాల సరసన మన దేశం సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఇందుకే.. సైఖోమ్ మీరాబాయ్ చాను.. మీకు సెల్యూట్ మేడమ్. మరి చూశారు కదా? సైఖోమ్ మీరాబాయ్ చాను పోరాటం ఎలాంటిదో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.