ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రీడాలోకంలో తీవ్ర విషాదం నింపింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన లెజెండ్.. ఇక లేడన్న వార్తను సహచర ఆటగాళ్లు సహా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. థాయ్‌లాండ్‌లోని విల్లాలో ప్రాణాలు వదిలారు. ఈ విషాదం నుంచి క్రీడా ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మణికట్టుతో మాయ చేసే వార్న్ నును గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రికీ పాంటింగ్ సైతం దుఃఖం ఆపుకోలేక బోరున ఏడ్చేశాడు.
‘‘ఉదయాన్నే నిద్ర లేవగానే మెసేజ్‌లు వెల్లువెత్తాయి. నా కుమార్తెను ఉదయాన్నే నెట్‌బాల్ ఆడటానికి తీసుకువెళ్లాలనే ప్లాన్‌తో గత రాత్రి కొంచెం తొందరగా పడుకున్నాను. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. అందరి లానే నేను కూడా ఈ వార్త విన్నాక తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. తనతో ముడిపడిన జ్ఞాపకాలెన్నో ఉన్నాయి. నా జీవితంలో తనొక భాగం’’ అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
తనకు 15 ఏళ్ల వయసున్నపుడు క్రికెట్ అకాడమీలో వార్న్‌ను కలిశానన్న పాంటింగ్… వార్న్ తనకు ఓ నిక్‌నేమ్ పంటర్ అని పెట్టాడంటూ గుర్తు చేసుకున్నాడు. దశాబ్దకాలం పాటు తామిద్దరం కలిసి క్రికెట్ ఆడామని, కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామంటూ అతడితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటించాడు. ఈ సందర్బంగా సహచర ఆటగాడు షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.