ఇటీవల కాలంలో క్రీడాకారుల జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసపెట్టి సందడి చేస్తున్నాయి. ఇదివరకే భాగ్ మిల్కా భాగ్, ఎంఎస్ ధోని, మేరి కోమ్, 86 వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. భారతీయులకు అత్యంత ప్రియమైన ఆటల్లో క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు ఎక్కువగా క్రికేట్ నేపథ్యమున్న క్రీడకారుల బయోపిక్‌లు తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. భారత క్రికెటర్ ప్రవీన్ తాంబే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రవీన్ తాంబే ఎవరు?’. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడే ప్రవీన్ తాంబే. ఈ సినిమా టైటిల్ రోల్లో శ్రేయాస్ తల్పడే నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాటర్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
క్రికెట్లో నలభై ఏళ్లు దాటితే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి కామెంటేటర్‌గానో, కోచ్‌గానో సెటిల్ అవుతారు.కానీ నలభై ఏళ్లలో కొత్తగా కెరీర్ మొదలుపెట్టడం అంటే అసాధ్యం అనే చెప్పాలి. ముంబై క్రికెటర్ ప్రవీణ్ తాంబే విషయంలో అదే జరిగింది. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో 2013 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రవీణ్ తాంబే అరంగేట్రం చేశారు. 2014 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై హ్యాట్రిక్ సాధించాడు. ఆ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రవీణ్ తాంబే ప్రాతినిథ్యం వహించాడు.
శ్రేయాస్ తల్పడే టైటిల్ పాత్రలో నటిస్తున్న..ఈ సినిమా ట్రైలర్‌ను విడుదలచేశారు. రాహుల్ ద్రావిడ్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. క్రికెట్, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోతూ ఇబ్బందులు పడే వ్యక్తిగా ట్రైలర్ లో శ్రేయాస్ తల్పడే కనిపించారు. పెళ్లి చూపుల్లో ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు బౌలింగ్, బ్యాటింగ్ కూడా చేస్తాను అని చెప్పడం నవ్వులను పంచుతుంది. 34 ఏళ్లు వచ్చినా కూడా నేషనల్స్‌లో ఆడాలని కలలు కనే వ్యక్తిగా ఎమోషనల్‌గా అతడి క్యారెక్టర్‌ను చూపించారు. ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత స్పిన్నర్‌గా మారి నలభై ఒక్క ఏళ్ల వయసులో ప్రవీణ్ తాంబే తన కలను ఎలా నెరవేర్చుకున్నాడో ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఈ చిత్రం గురించి క్రికెటర్ ప్రవీన్ తాంబే మాట్లాడుతూ.. “నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆ జాబితాలో మరికొంతమంది చేరతారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రయత్నించాలి. ఎవరికి వారు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు” అని చెప్పుకొచ్చారు.ఈ సినిమా ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.