జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తరువాత వన్డే మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానులు పోటెత్తనున్నారు. ఇప్పటికే.. ఈ మ్యాచుకు సంబంధించి టిక్కెట్లు దాదాపు అమ్ముడయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ వెల్లడించారు. 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతి ఉంటుందన్న సీపీ, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మ్యాచ్ కోసం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే అభిమానులను స్టేడియంలోపలికి అనుమతించనున్నారు. లోపలకి సెల్‌ఫోన్ మినహా మరేదీ అనుమతించరు. అభిమానులు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదని సూచించారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్న వారు మాత్రమే లోనికి అనుమతి ఉంటుంది. మహిళల కోసం 40 మందితో ప్రత్యేక షీ టీమ్ బృందాలను ఏర్పాటు చేశారు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందాపై ప్రత్యేక నిఘా ఉంచారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడటం, న్సటం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. బ్లాక్ టికెట్ల విక్రయంపై ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశామని సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మరోవైపు మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ ఏడాది చివరిలో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌పై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని వన్డేల్లోనూ పూర్తి బలమైన జట్టునే ఎంపిక చేస్తోంది. దాదాపు శ్రీలంకపై సిరీస్ గెలిచిన జట్టునే కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత విషయాలు కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోగా, శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. కేవలం వీరి స్థానాల్లో మాత్రమే వేరే వారికి అవకాశం దక్కనుంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా కొనసాగనుండగా, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పాండ్యా మిడిలార్డర్‌లో కొనసాగనున్నారు. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లో ఒకరికే తుది జట్టులో స్థానం దక్కొచ్చు. ఇక పేస్ విషయానికొస్తే.. షమీ, సిరాజ్, ఉమ్రాన్ బరిలోకి దిగొచ్చు. ఈ మ్యాచులో విజయం ఎవరిని వరించనుందో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Poster for the India vs New Zealand ODI series. pic.twitter.com/xaBPex1ndJ
— Johns. (@CricCrazyJohns) January 13, 2023