పదే పదే గాయాల బెడదతో జట్టుకు దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై, భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతానికి బుమ్రాను మర్చిపోవడమే మంచిదని.. అతడు తిరిగి జట్టులోకి వచ్చాక అప్పుడు తుది జట్టులో అతని స్థానం గురుంచి మాట్లాడటం మంచిందని వ్యాఖ్యానించాడు.
‘బుమ్రా.. బుమ్రా.. బుమ్రా..’ నిత్యం వార్తల్లో నిలిచే ఏకైక భారత క్రికెటర్. ఒకవైపు గాయాలు.. మరోవైపు అభిమానుల తూటాలు. ఇవి చాలవన్నట్లు మాజీ ఆటగాళ్ల సూటి పోటీ మాటలు. ప్రస్తుతం బుమ్రా క్రికెట్ ప్రయాణం ఇలానే సాగుతోంది. గాయాలు తగ్గుముఖం పట్టకపోవడంతో వరుస సర్జరీలు చేపించుకుంటూ బిజీ.. బిజీ.. జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ టీమిండియా పేసర్ పై మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతూనే ఉన్నారు. తాజాగా, భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్, జస్ప్రీత్ బుమ్రా గురుంచి ప్రస్తావిస్తూ.. ‘ప్రస్తుతానికి బుమ్రాను మరిచిపోవడమే మంచిదంటూ..’ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్ తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 68.52 విజయాలు.. 148 మెరిట్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, 60.29 విజయాలు, 123 పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలు లేకుండానే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఓడితే.. ఇతర జట్ల విజయావకాశాలపై ఆధాపడాల్సిందే. ఈ క్రమంలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో ఎవరెవరు తుది జట్టులో ఉంటే బాగుంటుదన్న దానిపై మదన్ లాల్ స్పందించాడు.
మదన్ లాల్ స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బుమ్రా గురించి ఇప్పటికైతే మర్చిపోవాల్సిందేనని వ్యాఖ్యానించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరుగనుంది కావున ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో భారత జట్టు బరిలోకి దిగాల్సి ఉంటుందన్నాడు. నిలకడగా రాణిస్తోన్న ఉమేశ్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందేనన్నాడు. “ప్రస్తుతానికి బుమ్రా సమీకరణాలు పక్కన పెట్టడమే మంచిది. అతడు కోలుకొని తిరిగి జట్టులోకి వస్తే అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే ఏది అందుబాటులో ఉందో దానినే ఉపయోగించుకోవాలి. అతడు ఏడాది, ఏడాదిన్నర తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతడు చాలాకాలంగా ఆడలేదు. కావున అతడి గాయం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు..” అని మదన్‌లాల్ చెప్పుకొచ్చాడు.
Madan Lal feels that India should move on from injured Jasprit Bumrah and look for some other options as he has not played for a long time.#Bumrah #MadanLal #CricTracker pic.twitter.com/QlC9x5rCD7
— CricTracker (@Cricketracker) March 4, 2023
సాధారణంగా ఒక ఆటగాడు గాయపడితే.. అది మానడానికి గరిష్టంగా మూడు నెలలు పడుతుందని, కానీ బుమ్రా సెప్టెంబర్ నుంచి ఆడడం లేదని మదన్‌లాల్ గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా వెన్ను సర్జరీ నుంచి కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టిందని, అదే బుమ్రా ఆరు నెలలైనా తుది జట్టులో చేరలేదని తెలిపాడు. కావున అప్పటి బుమ్రా, ఇప్పటి బుమ్రా ఒకటేనని ఎలా అనుకుంటారని ప్రశ్నించాడు. మళ్లీ ఒకప్పటి బుమ్రాను చూడాలంటే చాలా సమయమే పడుతుందన్నాడు. ఇండియా కనుక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే అప్పుడు ఉమేశ్ యాదవ్ మంచి ఆప్షన్ అని మదన్ లాల్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
కాగా, మదన్‌లాల్ చేసిన ఈ వ్యాఖ్యలు బుమ్రా కెరీర్ ను సంధిగ్ధంలో పడేశాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏడాది, ఏడాదిన్నర తర్వాత వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారంటే.. బుమ్రా కెరీర్ ముగిసినట్టేనా..? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రస్తుతానికి బుమ్రా న్యూజిలాండ్ కు పయనమయ్యాడు. వెన్ను సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం బుమ్రా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకోసం న్యూజిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే బుమ్రాకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ నుండి తిరిగి వచ్చాక అతడు మళ్లీ గ్రౌండ్‌లోకి దిగే అవకాశం ఉంది. మదన్ లాల్ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jasprit Bumrah set to be ruled out of IPL 2023 and WTC Final.
He’s likely to undergo back surgery, hoping for a strong comeback from Boom! He’s a champion guy.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2023