ఇండియన్ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఘనకార్యాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఏడో తరగతిలోనే ప్రేమ పాఠాలు మొదలుపెట్టిన అశ్విన్.. ఓ అమ్మాయిని క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రేమ విషయం చెప్పాడట.
భారత దిగ్గజ స్పిన్నర్, నూతన మన్కడింగ్ హీరో రవిచంద్రన్ అశ్విన్ మాయల గురుంచి మనందరికీ విదితమే. మాయలంటే.. మనకు తెలిసింది మైదానం వరకే అండోయ్. అదే పర్సనల్ లైఫ్ లో ఇతగాడు చేసిన ఈ మాయలు ఇన్నాళ్లు బయటకి తెలియకపోయినా.. ఇప్పుడు బయటపడ్డాయి. ఈ విషయాలన్నీ అతని భార్యే బయటపెట్టింది. అశ్విన్ భార్య ప్రీతి తాజాగా జియో సినిమా AJIO మ్యాచ్ సెంటర్ లైవ్ ప్రోగ్రామ్ అయిన ‘హ్యాంగ్‌వుట్’ లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో హోస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ‘ దాచుకోలేక.. అశ్విన్ బాగోతాన్ని, వీరి దాంపత్య జీవితం గురించి అన్నీ విషయాలు బయటపెట్టేసింది. ఆడవారి నోటిలో ఏ విషయాలు దాగవనడానికి ఈమెనే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
ఈ ప్రోగ్రాంకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి, డానిష్ సేత్‌లు హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈ క్రమంలో.. ‘కింగ్, క్వీన్..’ అంటూ యూనిక్ చెస్ గేమ్ ఆడుతూ ప్రీతితో తమ సంభాషణలు పెట్టారు. వారి అడిగే ప్రశ్నలు.. ఆమె ఇచ్చే సమాధానాల ఆధారంగా చెస్ బోర్డులో పావులు కదపాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా హోస్ట్‌లు.. అశ్విన్‌తో పరిచయం, దంపతులు కాకముందు, దంపతులు అయ్యాక, వీరి దాంపత్య జీవితం ప్రశ్నలు సంధించారు. అందుకు ఆమె ఏమాత్రం తడబడకుండా.. అన్నీ విషయాలు బయటపెట్టేసింది.
“చిన్నప్పుడు అశ్విన్, తాను ఒకే స్కూల్‌లో చదువుకునే వాళ్లమని, తాను ఏడో తరగతిలో ఉన్నప్పటి నుంచే అశ్విన్ అంటే చచ్చేంత ప్రేమ అని చెప్పుకొచ్చింది. పైగా ఆ విషయం మా స్కూళ్లో అందరికీ తెలుసని వెల్లడించింది. ఆ తర్వాత అశ్విన్ క్రికెట్ శిక్షణ పేరుతో స్కూల్ మారాడని.. అప్పటినుంచి తాము ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎదురుపడేవాళ్లమని తెలిపింది. కొన్నేళ్లకు తాను చేస్తున్న ఉద్యోగంలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అకౌంట్‌ను హ్యాండిల్ చేసేందుకు వెళ్లగా అక్కడ అశ్విన్ మరోసారి కనిపించాడని గుర్తు చేసుకుంది. అశ్విన్ మళ్లీ కనిపించడంతో అప్పటిదాకా బ్రేకులు పడ్డ తమ ప్రేమ మళ్లీ మొదలైందని ప్రీతి తెలిపింది.
ఇలా సాఫీగా సాగుతున్న తమ ప్రేమ ప్రయాణంలో.. అశ్విన్ ఓరోజు ఆమెను క్రికెట్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి ప్రేమ విషయం చెప్పాడని ముసిముసి నవ్వులు చిందిస్తూ గుర్తు చేసుకుంది. ‘నేను జీవితాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటాను.. గత పదేళ్ల నుంచి నీ మీద నాకున్న ప్రేమలో ఏ మాత్రం మార్పులేదు.. రాబోవు రోజుల్లో మార్పు ఉండదు. మనిద్ధరం పెద్దవాళ్లమయ్యాం. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు..?..’ అని అశ్విన్ అన్నట్లు ప్రీతి వివరించింది. ఇక వీరి దాంపత్య విషయం గురించి చెప్తూ.. ఇద్దరం ప్రతి రోజూ గొడవపడతామని తెలిపింది. ఇవాళ ఉదయం కూడా ఇద్దరి మధ్య వాదన జరిగిందని చెప్పుకొచ్చింది. ఇలా అశ్విన్ గురించి, అతడు చెప్పే సారీల గురుంచి అన్నీ విషయాలు బయటపెట్టేసిందన్నమాట. ఈ వీడియో ఫుల్ ఎపిసోడ్ ను మీరూ తిలకించి.. వీరిపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.