బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది. ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒక్కగానొక్క బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కాషాయ పార్టీకి బై.. బై.. చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్‌తో సమావేశం అయ్యారని విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది బీజేపీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి.
రాజా సింగ్ ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జైలుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అది జరిగి ఆరు నెలలు అవుతున్నా అతనిపై ఉన్న సస్పెన్షన్ పై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలని నిరణయించుకున్నట్లు సమాచారం. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన రాజా సింగ్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం 2009 మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొంది 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు.ఆపై 2014లో బీజేపీలో చేరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాజా సింగ్ కావడం గమనార్హం.
టీడీపీలోకి రాజా సింగ్!!
బీజేపీ నుండి సస్పెండ్ చేయబడ్డ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన సొంత గూడు టీడీపీ పార్టీలో చేరుతున్నాడు అంటూ ఊహాగానాలు. pic.twitter.com/kbfSAG6Boh
— Telugu Scribe (@TeluguScribe) April 28, 2023