‘కాంతార’.. ఈ సినిమా రిలీజైనప్పుడు అస్సలు అంచనాల్లేవు. ఎందుకంటే జస్ట్ రూ.16 కోట్లతో తీసిన ఈ చిత్రం.. వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని, సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఎవరూ అనుకుని ఉండరు. కానీ రియాలిటీలో అదే జరిగింది. ప్రస్తుతం రూ.400 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది. ఒరిజినల్ వెర్షన్ విడుదలై 40 రోజులు అవుతున్నప్పటికీ ఏ మాత్రం దూకుడు తగ్గట్లేదు. సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. దీనికి తోడు మిగతా భాషల్లోనూ అదే జోరు కొనసాగిస్తోంది. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో నిర్మాతలు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా చూసేవాళ్లందరూ థియేటర్ కి వెళ్లడం బాగా తగ్గించేశారు. అలాంటి వాళ్లని కూడా థియేటర్లలోకి తీసుకొచ్చిన డబ్బింగ్ సినిమా ‘కాంతార’. అక్టోబరు 15న తెలుగులోకి విడుదలై.. ఇప్పటికే రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటికీ ఆడియెన్స్.. థియేటర్లలోకి వెళ్లి మరీ ఈ సినిమా చూస్తున్నారు. గత మూడు నాలుగు వారాల్లో పలు సినిమా వచ్చి వెళ్తున్నప్పటికీ.. ‘కాంతార’ మాత్రం స్థిరంగా నిలబడింది. ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే బ్యాచ్ కూడా ఒకటుంది. అలాంటి వాళ్లకు ఇప్పుడు ఓ బ్యాడ్ న్యూస్!
ఎందుకంటే ఒరిజినల్ కన్నడ వెర్షన్ సినిమా రిలీజైనప్పుడు.. లెక్క ప్రకారం నెల రోజుల తర్వాత అంటే నవంబరు 4న స్ట్రీమింగ్ చేస్తారని అనుకున్నారు. ఆ తర్వాత ఆ తేదీ నవంబర్ 18కి మారింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసేలా కనిపిస్తోంది. దీంతో నిర్మాతలు పునరాలోచనలో పడిపోయారు. ఇక నవంబరు చివర్లోనే ఓటీటీలో తీసుకురావాలని స్ట్రీమింగ్ పార్ట్ నర్ అమెజాన్ ప్రైమ్ తో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 14 ప్రధాని నరేంద్ర మోదీ, హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టితో కలిసి ఈ సినిమా వీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఓటీటీ రిలీజ్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.