మూడు ముళ్ళు, ఏడు అడుగులు, వేద మంత్రాలు, ఓ అరుంధతి నక్షత్రం.. ఓ తతంగంలా చూస్తే పెళ్లంటే ఇదే. కానీ.., ఒక్కసారి ఈ తంతు పూర్తయితే.. ఆ రెండు తనువులుమాత్రమే కాదు, హృదయాలు కూడా ఒక్కటైనట్టే. కానీ.., ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించి, పెళ్లి చేసుకున్న అమ్మాయిని శోభనం అవ్వగానే వదిలేశాడు. నాకు నా భార్య వద్దు అంటూ పోలీస్ స్టేషన్ లోనే పట్టుబట్టి కూర్చున్నాడు. గుండెని బరువు ఎక్కించే ఈ ఘటన ఇల్లెందులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన మద్దెబోయిన సత్యవతికి భర్త లేడు. ఆమెకి శృతి అనే 22 ఏళ్ల కుమార్తె ఉంది. తల్లి కూలి పనులకి పోతుండగా, శృతి పట్టణంలోని ఓ స్వీట్ షాపులో వర్కర్ పనిచేస్తోంది. తల్లి కూతుళ్లు ఇద్దరు ఇల్లెందు పాత బస్టాండ్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. ఇంత వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. కానీ.., 23 ఏళ్ల మేకల దినేష్ వీరి జీవితంలోకి రావడంతో పరిస్థితి అంతా తలకిందులు అయ్యింది.
దినేష్ ప్రేమ పేరుతో శృతి వెంటపడ్డాడు. ఆమె ఎంత వద్దని వారించినా మాట వినిపించుకోలేదు. చివరికి దినేష్ ప్రేమలో నిజాయతి చూసి శృతి అతని ప్రేమని ఒప్పుకుంది. తన తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ఒప్పుకోరని, పెళ్లయ్యాక వాళ్లే సద్దుకుపోతారని నమ్మించి శృతిని పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు దినేశ్. తరువాత కొత్తగూడెంలోని రుద్రంపూర్లో ఓ గది అద్దెకు తీసుకుని కాపురం కూడా పెట్టాడు.
వారం రోజుల తరువాత దినేశ్ కుటుంబం రంగంలోకి దిగింది. దినేశ్ బంధువులు ఇంట్లోకి రావడంతోనే శృతిపై దాడిచేసి.., ఆమెని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వారి దెబ్బలకి సృహ కోల్పోయిన శృతిని తల్లి సత్యవతి వద్ద వదిలి, వారు దినేశ్ ని తమ వెంట తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్ లో కోలుకున్న శృతి రెండురోజుల తరువాత ఇల్లెందు పోలీసులను ఆశ్రయింంది.
పోలీసులు దినేష్ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. పెళ్లి అయిపోయింది కాబట్టి కోడలిని అంగీకరించాల్సిందిగా కోరారు. కానీ.., ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే.., పెళ్లి కొడుకు దినేష్ సైతం శృతి తనకి వద్దని పోలీసుల ముందు చెప్పాడు. దీంతో.. పోలీసులు ఈ కేసులో లీగల్ ప్రొసీడింగ్స్ కి సిద్ధమయ్యారు. అయితే అంతలోనే మనస్థాపం చెందిన శృతి బాత్ రూమ్ క్లీన్ చేసే ఆర్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం శృతి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. పెళ్లి పేరుతో ఆడ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుతున్న దినేష్ లాంటి వారికి ఏ శిక్ష వేయాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి