ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మీకు.. మీ ప్రేమించే వారికి కూడా అని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ధూమ పానం చేయకండి, చేయించకండి అంటూ సినిమా థియేటర్లలోనూ, ప్రతి సినిమాకు ముందు ప్రజా సంక్షేమార్థం భారత ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వచ్చిన వారంతా, ఈ ప్రకటనలను జోక్ గానో, లేక మీమ్స్ రూపంలో చేసి.. తమ సరదాను తీర్చుకుంటారు. ఇంతా చెబుతున్నప్పటికీ .. బహిరంగ ప్రాంతాల్లో స్మోకింగ్ చేయడం మానేయరు. పోనీ కాల్చిన బీడీ, సిగరెట్ పీకలను అయినా చెత్త బుట్టలో వేస్తారా అంటే అదీ లేదు. రోడ్లపై, బహిరంగ ప్రాంతాల్లో పడేసి, కాలితో నలిపేస్తుంటారు.
ఈ పీకలు అత్యధికంగా పడేసే వ్యర్థాలని, పర్యావరణ వ్యవస్థని దెబ్బ తీస్తోందని ఐక్యరాజ్య సమితి చెప్పినా వినిపించుకోం. వీటి వల్ల ప్రతి సంవత్సరం సుమారు 766 మిలియన్ కిలో గ్రాముల విషపూరిత చెత్త పేరుకుపోతుందట. మన దేశంలో బహిరంగ ప్రాంతాల్లో సిగరెట్, బీడిలు తాగినా.. ఫైన్ ఉన్నప్పటికీ.. సీరియస్ గా తీసుకోరు. కానీ విదేశాల్లో ఇలాంటివి చెల్లవు. అక్కడి రోడ్లపై చెత్త వేయడం నిషిద్ధం. ఒక వేళ చెత్త ఎవ్వరికీ కనిపించినా.. బాధ్యయుతంగా డస్ట్ బిన్ లో వేస్తారు. అయితే కొంత మంది ఫన్ కోసమే, నిర్ల్యక్షంతో చేసిన కొన్ని పనులు, వారిని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. అలా చేసుకుని పీకలమీదకు తెచ్చుకున్నాడో బ్రిటీష్ కు చెందిన ఓ వ్యక్తి.
వివరాల్లోకి వెళితే.. గ్లౌసెస్టర్ షైర్ లో అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి బహిరంగంగా ధూమపానం చేస్తుండగా సిటీ కౌన్సిల్ సిబ్బంది అతడిని పట్టుకుని నోటీసులిచ్చారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన సిగరెట్ ను అధికారుల ముందే రోడ్డుపై పడేశాడు. అనంతరం నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే బహిరంగంగా ధూమపానం చేసినందుకు రూ. 15 వేలు జరిమానా వేద్దామని అధికారులు భావించినప్పటికీ.. అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకు జరిమానాకు సర్ చార్జీ కూడా కలిపి రూ. 55,603 జరిమానా విధించారు. ఈ సిగరెట్ బట్స్ (పీకలు) అనేవి కనిపించకుండా పేరుకుపోయే చెత్తని, అవి భూమిలో కలిసిపోయేందుకు ఏడాదిన్నర పడుతుందని సౌల్ గ్లౌసెస్టర్ షైర్ కౌన్సిల్ పర్యావరణ అమలు క్యాబినేట్ సభ్యుడు, కౌన్సిలర్ రాచెల్ హంట్ తెలిపారు. అవి తానే వేశానని అలెక్స్ అంగీకరించినట్లు చెప్పారు.