మనిషి ఒంటిరిగా ఎక్కువ కాలం జీవించలేడు. జీవితంలో ఏదో ఓ సందర్భంలో తోడు అవసరం అవుతుంది. అందుకే మన సమాజం వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. భార్య, బిడ్డలు, బంధువులు, స్నేహితులు.. ఇలా ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల బంధాలుంటాయి. ఇవేవి లేని వారు నిజంగా దురదృష్టవంతులనే చెప్పవచ్చు.
ముఖ్యంగా సెలవులు, పండుగల వేళ ఒంటిరిగా ఉండటం చాలా బాధాకరమైన అంశం. అనుభవించే వారికే ఆ నరకం తెలుస్తుంది. తాజాగా ఇలా బంధాలకు దూరమైన ఓ 66 ఏళ్ల వ్యక్తి.. తోడు కోసం చేస్తున్న ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మాట్లాడటానికి, మిగిలిన జీవితం కలిసి ఉంటడానికి తనకు ఓ మంచి మహిళ కావాలంటూ ఓ బిల్ బోర్డ్ ను ఏర్పాటు చేశాడు. ఆ వివరాలు..
అమెరికాకు చెందిన జిమ్ బేయిస్ అనే వ్యక్తి మొదటి నుంచి ఒంటరి వాడు కాదు. గతంలో అతడికి ఏకంగా రెండు పెళ్లిల్లు అయ్యాయి. ఐదుగురు సంతానం కూడా ఉన్నారు. కానీ వ్యక్తిగత కారణాలు, పనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆ వివాహ బంధాలు కలకాలం కొనసాగలేదు. ఇద్దరు భార్యల నుంచి విడిపోయాడు.
జాబ్ చేస్తూ ఉండబట్టి.. ప్రారంభంలో పెద్దగా ఒంటరితనం ఫీలవ్వలేదు బేయిస్. కానీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక అతడికి ఒంటరితనం ఎంత దారుణంగా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది. గతంలో భార్య, బిడ్డలను పట్టించుకోకపోవడంతో.. వారు ఇతడి గురించి ఆలోచించడం మానేశారు. ఇక లాభం లేదనుకున్న బెయిస్.. తనకు ఓ తోడు కావాలని భావించాడు.
అందుకోసం ప్రకటన ఇస్తూ.. టెక్సాస్ హైవేపై ఓ బిల్ బోర్డ్ ను ఏర్పాటు చేశాడు. ‘50-55 సంవత్సరాల మధ్య వయసు ఉండి, జాలి, దయ కలిగిన మంచి మహిళ తోడు కోరుకుంటున్నాను. మిగిలిన జీవితం అంతా ఆమెతో కలిసి జంటగా ప్రయాణించాలని భావిస్తున్నాను. ఆసక్తి ఉన్న వారు నా నంబర్ కు కాల్ చేయండి’ అంటూ ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రకటన తెగ వైరలవుతోంది.