కర్ణాటక- చిన్నప్పుడు ఆమెను పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే పోలీస్ అవుతానని టక్కున చెప్పేది. అవును పోలీస్ కావాలనేది ఆమె చిన్ననాటి కల. అలా కల కంటూనే పెరిగి పెద్దైంది. తీరా పోలీస్ సెలక్షన్ కోసం ఫిజికల్ ఈవెంట్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు గర్బవతి. ఈ పరిస్థితుల్లో రన్నింగ్ చేస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. కానీ ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు.
పోలీస్ సెలక్షన్స్ కు సంబందించిన ఫిజికల్ టెస్ట్ లో పాల్గొని పాస్ అయ్యింది కూడా. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కలబురాగికి చెందిన 24 ఏళ్ల అశ్విని చిన్నప్పటి నుంచి పోలీసు కావాలని కలలు కంటూ పెరిగింది. కానీ పోలీస్ కావాలంటే ఆశామాషి వ్యవహారం కాదు. పోలీస్ ఉద్యోగం కావాలంటే రన్నింగ్, జంపింగ్ పోటీలతో పాటు రాత పరీక్షల్లోనూ పాస్ కావాల్సి ఉంటుంది. అశ్విని గతంలో రెండుసార్లు ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయినప్పటికీ రాత పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఇంతలో ఆమెకు పెళ్లైంది.
పోలీస్ కావాలన్న ఆమె లక్ష్యాన్ని అర్ధం చేసుకున్న అశ్విని భర్త ఆమెను ప్రోత్సహించాడు. మూడో ప్రయత్నంలో పోలీసు కావాలని కష్టపడి సాధన చేసింది అశ్విని. ఐతే పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ 10రోజులు ఉండగా ఆమె గర్భం దాల్చింది. అప్పుడు ఏం చేయాలో పాలుపోక డాక్టర్ ను కలిసి తన పరిస్థితి వివరించింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు రన్నింగ్, జంపింగ్ లాంటివి చేయకూడదని, అలా చేస్తే అబార్షన్ తప్పదని డాక్టర్ హెచ్చరించారు. కానీ అశ్విని ధైర్యం చేసి రన్నింగ్ రేస్ లో పాల్గొంది. 400 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా, 1.36 సెకన్లలో టార్గెట్ పూర్తి చేసింది అశ్విని.
పోలీసు ఉన్నతాధికారులు అశ్విని సాహసం గురించి తెలుసుకుని ఆమెను అభినందించారు. అశ్విని గర్భవతి అనే విషయం తమకు ముందు తెలియదని, చాలా మంది ఇలాంటి సందర్బంలో ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే భయపడతారని, కానీ అశ్విని ధైర్యం చేసి పాల్గొనడమే కాకుండా క్వాలిఫై కావడం ఆనందంగా ఉందని అన్నారు. మరి అశ్విని రాత పరీక్షలోను క్వాలిఫై అవ్వాలని, పోలీస్ కావాలన్న ఆమె కల నెరవేరాలని మనమూ కోరుకుందామా..