జీవితంలో మనకు సహాయం అందించిన వారికి కొన్నిసార్లు కృతజ్ఞతలు తెలపడానికి మొహమాటం అనేది అడ్డుగా వస్తుంటుంది. కానీ ఎలాగైనా సహాయం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే తపన మాత్రం మనల్ని ఊరుకోనివ్వదు. అలాంటి సందర్భాలలో వేరొకరి సాయంతోనో లేక ఎలాగోలా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా.. వైద్యం చేసి తన భార్యను కాపాడిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి ఓ వ్యక్తి వినూత్నంగా లేఖ రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలోని మెట్టవీధికి చెందిన గుడ్ల రామారావు భార్య పుష్పలతకు పక్షవాతం కారణంగా నోరు, కుడికాలు, కుడిచేయి పడిపోయాయి. ఆమెను టెక్కలి ఏరియా ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా.. వెంటనే స్పందించిన ఆసుపత్రి సిబ్బంది పది రోజులపాటు ఆమెకు వైద్యం అందించి కాపాడారు. తన భార్య త్వరగా కోలుకునేందుకు సహకరించిన వైద్యులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పలేక.. ఓ లెటర్ టైప్ చేయించి ఈ నెల 4న ఆసుపత్రి ఫిర్యాదుల పెట్టెలో వేసాడు భర్త రామారావు.
అయితే.. ఈ నెల 10న ఆ పెట్టెను తెరిచి, లెటర్ చదివిన వైద్యులు పట్టలేని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా భార్యకి నోటి మాట వచ్చేలా చేశారు. స్వచ్ఛమైన మనసుతో మంచి వైద్యం చేసిన డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. మీ హాస్పిటల్ కి వచ్చే ప్రజలని మీరు ఇలానే ఆదరిస్తూ.., ఉన్నతంగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఆ లెటర్ లోఉంది. దీంతో.., ఈ లేఖ చదివిన టెక్కిలి ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎల్లప్పుడూ నిందలు ఎదుర్కొనే తమకు ఈ లేఖ ద్వారా సంతోషం కలిగిందని వారు తెలిపారు. ప్రస్తుతం రామారావు టైప్ చేయించిన లేఖ సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మరి.. వైద్యులకు ఆనందం కలిగించిన రామారావు లేఖ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.