భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు.. అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహా మనిషి.. భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
దేశంలోని అణగారిని వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు.. భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన అగ్రగణ్యుడు.. వెనుకబడిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు.. భారత దేశానికి తొలి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు దేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లా విరార్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఊరేగింపు గా జనాలు పలు వాహనాల్లో వచ్చారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ర్యాలీ 10.30 నిమిషాలక పూర్తయ్యింది. కగ్గిల్ చైక్ నుంచి ర్యాలీ ముగించుకొని కార్యకర్తలు తిరిగి తమ ఇంటికి బయలు దేరారు. అదే సమయంలో ఊరేగింపు వాహనంపై కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాహనంపై ఏర్పాటు చేసిన ఇనుప జెండా అనుకోకుండా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కి తగిలింది. దాంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో రూపేష్ సర్వే, సుమిత్ సుత్ ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా వాహనంలో ఏర్పాటు చేసిన ఇనుప జెండా స్థంభం ట్రాన్స్ ఫార్మర్ కి తాకి కరెంట్ షాక్ రావడంతో ఇద్దరు చనిపోయారు.. ఐదుగురికి గాయాలు అయ్యాయని.. ఈ ఘటన గురువారం అర్థరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ముంబాయిలోని కస్పూర్భా ఆస్పత్రికి తరలించామని విరాట్ ఏసీపీ రామచంద్రన్ దేశ్ ముఖ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.