ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన నిస్వార్థమైన ప్రేమ మరొకటి లేదు. మన నుంచి ఏం ఆశించకుండా.. కేవలం మన సంతోషాన్ని మాత్రమే కోరుకునేది తల్లి. బిడ్డల క్షేమం కోసం నిత్యం తాపత్రయే పడే ఏకైక వ్యక్తి తల్లి. అమ్మ పంచే అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఎలాంటి కష్టం వచ్చినా.. తల్లి తట్టుకుంటుంది.. కానీ పిల్లలకు చిన్న ఇబ్బంది వచ్చినా ఊరుకోదు. అసలు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని నిత్యం పరితపిస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి మాతృమూర్తికి సంబంధించినదే. పెళ్లైన కొన్ని రోజులకే భర్త చనిపోయాడు.. అప్పటికే కడుపులో అతడి ప్రతిరూపం పెరుగుతుంది. ఇక ఒంటరి మహిళ అంటే.. మన సమాజంలో ఎలా చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మృగాళ్ల చూపుల నుంచి తనను మాత్రమే కాక బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ తల్లి అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 30 ఏళ్లుగా మగాళ్ల మాదిరి దుస్తులు ధరిస్తోంది. ప్రస్తుతం ఈ మాతృమూర్తి కథనం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఆ కంపెనీలో బోనస్, ఇంక్రిమెంట్స్ మాత్రమే కాదు.. ఉద్యోగులకు పెళ్లిళ్లు కూడా చేస్తారు!
తమిళనాడుకు చెందిన పెచ్చియామ్మాల్‌కు 20 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. ఇప్పటికి ఆమె పెళ్లై 30 సంవత్సరాలు కావోస్తోంది. అయితే దురదృష్టం కొద్ది పెళ్లైన కొద్ది రోజులకు పెచ్చియామ్మాల్ భర్త మృతి చెందాడు. అప్పటికే ఆమె గర్భవతి. భర్త చనిపోయిన తర్వాత కడ్డునాయగన్ పట్టికి మకాం మార్చింది. అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికింది. అయితే ఒంటరి మహిళ కావడం వల్ల ఎన్నో తప్పుడు చూపులు ఆమె వెంటపడి వేధించేవి. ఇంతలో పెచ్చియామ్మాల్‌కి కుమార్తె జన్మించింది. అయితే కూతురిని సంరక్షించడంతో పాటు తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఓ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంది పెచ్చియామ్మాల్. మృగాళ్ల వేధింపుల నుంచి తప్పించుకోవడం కోసం.. పురుషుడి వేషధారణలోకి మారింది. పేదరికం వల్ల పనికోసం చాలా ప్రాంతాలకు మారాల్సి వచ్చేది. ఎక్కడికెళ్లినా తనను తాను పురుషుడిలా పరిచయం చేసుకునేది. ఈ క్రమంలోనే స్థానికంగా “అన్నాచ్చి” (పెద్దన్న)గా గుర్తింపు పొందింది. కొన్నాళ్లకు తూతుక్కుడి తిరిగొచ్చి క్రాప్ హెయిర్ కట్, మగాడి దుస్తుల్లో పురుషుడిలానే జీవించసాగింది. టీ, పరోటా షాపుల్లో పనిచేసి ముత్తు మాస్టర్ గా పేరుగాంచింది. ఇలా 30 ఏళ్ల పాటు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ మగరాయుడిలా బతికింది పెచ్చియామ్మాల్.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భర్త ఇంట్లో బాత్ రూం లేదని కొత్త పెళ్లికూతురు ఆత్మహత్య!
ఈ సందర్భంగా పెచ్చియామ్మాల్ మాట్లాడుతూ..‘‘పెళ్లైన 15 రోజులకే భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆ తర్వాత సొంతూరు నుంచి తూతుక్కుడి వచ్చాను. ఓ ఇల్లు అద్దె తీసుకొని పనిచేసుకునేదాన్ని. ఓ రోజు పని ముగించుకొని వచ్చేటప్పుడు ఓ లారీ అతను నాతో తప్పుగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి సహకారంతో ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగాను. అతనే నాకో చొక్కా ఇచ్చి నన్ను ఇంటి దగ్గర దిగబెట్టాడు. మరునాడే 6 గంటలకు పని ముగించుకొని తిరుచానూరుకు వెళ్లి గుండు చేయించుకున్నా. చీర పక్కనపెట్టి ప్యాంటు, షర్టు, రుద్రాక్ష ధరించా. కొన్నాళ్లకు ఆ డ్రైవర్ ముందు నుంచే వెళ్లినా అతడు గుర్తు పట్టలేదు. అప్పుడే అనిపించింది.. నాకు ఈ దుస్తులే సరైనవని’’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. ఇడ్లీ అమ్మకు ఇల్లు!
పెచ్చియామ్మాల్ కూతురు షణ్ముక సుందరి మాట్లాడుతూ… ‘‘పనికి వెళ్లి వచ్చే క్రమంలో ఎదురైన వేధింపులతో అమ్మ పురుషుడిగా వేషధారణ మార్చింది. అమ్మా.. నాన్న అన్నీ తానై నాకు ఏ లోటూ లేకుండా చూసుకుంది. అమ్మ ఇలా చేసినందుకు గర్వంగా ఉంది. అయితే ధ్రువీకరణ పత్రాల్లో పురుషుడిలా ఉండటం వల్ల పింఛను తీసుకోవడంలో అమ్మ ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఆ సమస్య పరిష్కారమై అమ్మకు పింఛను అందితే ఆమెకు ఎంతో సాయంగా ఉంటుంది’’ అని తెలిపింది. మరి బిడ్డతో పాటు తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం పెచ్చియామ్మాల్ ఎంచుకున్న మార్గంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.