అభిప్రాయ బేధాలో, అభిరుచులో కలవక వివాహ బంధానికి స్వస్థి చెబుతున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అయితే విడాకులు మంజూరు కావడానికి కనీసం ఆరు నెలల సమయం ఇస్తుంది కోర్టు. ఇది కొన్ని సార్లు సమస్యగా మారింది.
జీవితాంతం తోడు నీడగా ఉండాలని స్త్రీ, పురుషులను వివాహ బంధంతో ఏకం చేస్తారు. ఒకరికి ఒకరు చేదోడువాదోడుగా ఉంటారని, ఉండాలని పెద్దలు ఆశ్వీరదిస్తారు. కానీ అభిప్రాయ బేధాలో, అభిరుచులో కలవక వివాహ బంధానికి స్వస్థి చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిని ఒకరు కించపరుచుకుని, దాడులు జరుగుతున్నాయి. ఇవి భరించలేని కొంత మంది విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అయితే విడాకులు మంజూరు కావడానికి కనీసం ఆరు నెలల సమయం ఇస్తుంది కోర్టు. మళ్లీ కలిసే అవకాశం అటు ఉంచితే.. ఆ సమయంలో కూడా భాగస్వామిపై దాడులు జరిగిన ఘటనలు ఎన్నో. అయితే తాజాగా విడాకుల మంజూరు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
విడాకుల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. విడాకుల కోసం ఆరు నెలల తప్పని సరి వ్యవధి నుండి మినహాయింపు నిచ్చింది. కలిసి జీవించలేని పరిస్థితులు లేకపోతే, వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చునని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తీవ్రంగా మనస్పర్థలు ఉండి ఇద్దరు ఏకాభిప్రాయంతో విడాకుల కోసం కోర్టుకు వెళితే.. ఫాస్ట్ ట్రాక్ విధానంలో డివోర్స్ ఇవ్వొచ్చునని తెలిపింది. మెయింటెనెన్స్, భరణం, పిల్లల హక్కులకు సంబంధించిన బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయాలో కూడా బెంచ్ వివరించింది. కలిసి ఉండలేని తీవ్ర సమస్యలు, విబేధాలు ఇద్దరి మధ్య ఉంటే ఆర్టికల్ 142 ప్రకారం విస్తృత అధికారాలు వినియోగించుకుని ఆరు నెలల నుండి 18 నెలల వ్యవధి లేకుండానే విడాకులు మంజూరు చేయవచ్చునని తెలిపింది.