మన దేశంలో రాజకీయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది డబ్బు, మద్యం పంపిణీ, ఇతరాత్ర హామీలు. ఈ రోజు డబ్బు తీసుకుని మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని తెలుసు. అయినా సరే.. ఎన్నికల ముందు పంచే చిల్లర కోసం కక్కుర్తి పడి.. మన భవిష్యత్తుతో పాటు దేశ అభివృద్ధిని అడ్డుకున్న వారం అవుతున్నాం. ఇక రాజకీయాల్లోకి చదువుకున్నవారు రావాలని ఎప్పటి నుంచో చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన యువత రాజకీయాల్లోకి వస్తే.. దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది అంటారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలను ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలో పీజీ పూర్తి చేసిన యువకుడు.. తన గ్రామం పరిస్థితి చూసి చలించిపోయాడు. ఊరిని బాగుచేయాలని నిర్ణయించుకున్నాడు. సర్పించిగా పోటీ చేసి గెలిచాడు. తర్వాత ఆ ఊరి తలరాతనే మార్చేశాడు. ఒకప్పుడు తాగేందుకు గుక్కెడు నీటి కోసం ఇబ్బంది పడిన ఆ ఊరిలో.. నేడు అందరూ మిలియనీర్లుగా ఎదిగారు. నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం కథ..
ఆ గ్రామం హివ్రే బజార్.. మహారాష్ట్రలోని ఓ మారుపూల పల్లెటూరు. సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ గ్రామం దారుణ పరిస్థితులు చవి చూసింది. తినడానికి తిండి లేక.. తాగడానికి గుక్కెడ మంచి నీరు లభించక గ్రామస్తులు అల్లాడిపోయారు. 1980ల నాటికి పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయింది. 90 శాతం మంది ప్రజలు గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇక ఆ ఊరు చరిత్రగర్భంలో కలిసిపోవడానికి ఎంతో దూరం లేదనుకుంటున్న సమయంలో.. ఆ గ్రామానికి వచ్చిన ఓ యువకుడు.. పరిస్థితిని తలకిందులు చేశాడు. ప్రపంచం మెచ్చుకునే స్థాయికి తీసుకెళ్లాడు.
ఊరి చరిత్ర మార్చిన పొపట్రావు పవార్..
హివ్రే బజార్ గ్రామంలో పీజీ వరకు చదువుకున్న వ్యక్తి పొపట్రావు పవార్ మాత్రమే. సిటీలో చదువుకుని వచ్చాడు. తన కళ్ల ముందే గ్రామం నాశనం కావడం చూడలేకపోయాడు. సర్పంచిగా పోటీ చేశాడు. నిజానికి పవార్‌కు రాజకీయాలపై పెద్దగా సదాభిప్రాయం కానీ, ఆసక్తి కానీ లేదు. కానీ చదువుకున్న నువ్వు మాత్రమే గ్రామాన్ని రక్షించగలవు అంటూ ఊరి వాళ్లు అతడిని ఒప్పించారు. ఎన్నికల్లో నిలబడ్డ పవార్.. భారీ విజయం సాధించాడు.
చదవిన చదువు.. తన గ్రామ అభివృద్ధి కోసం వినియోగించడం ప్రారంభించాడు పవార్. అసలు ఊరు ఇలా తయారవ్వడానికి.. నాశనం కావడానికి గల మూల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు అతడికి కనిపించినవి సారా దుకాణాలు. ఆ చిన్న గ్రామంలోనే సుమారు 22కి పైగా సారా దుకాణాలున్నాయి. మద్యానికి అలవాటు పడ్డ జనాల్లో.. తాగి తాగి ఎంతో మంది చనిపోగా.. చాలా మంది ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. చివరికి గ్రామంలో అందరూ ఉపాధి కోసం బయటి ఊళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. అలాగే చెరువులు ఎండిపోయి, చుక్క నీరులేని పరిస్థితి. వీటన్నింటిని పరిశీలించిన పవార్.. గ్రామం విడిచి వెళ్లిన జనం వెనక్కి రావాలంటే నీరు పుష్కలంగా ఉండాలి అని భావించాడు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాడు పవార్.
చుక్క నీరు వృథా కాకుండా..
గ్రామాన్ని బాగు చేసుకునే క్రమంలో తొలుత నీటిని ఒడిసిపట్టే ఏర్పాట్లు చేశాడు. ఊర్లో పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెరువు తవ్వించాడు. దీంతో వానలు పడ్డాక భూగర్భజలాలు పెరిగాయి. దాదాపు ఆ చిన్న గ్రామంలో 52 ఇంకులు గుంతలు తవ్వించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చుట్టూ తిరిగి కాలువలు ఉన్న చోట చెక్ డ్యాములు కట్టించాడు. దీంతో గ్రామంలో నీటి నిల్వలు పెరిగాయి. వ్యవసాయానికి అనుకూలంగా మారాయి. దాంతో ఉపాధి కోసం బయటికి వెళ్లిన ప్రజలు తిరిగి ఊళ్లకు వచ్చారు. 70 హెక్టార్లలో పంటలు పండించడం మొదలుపెట్టారు. బోర్లు వేస్తే చాలు కేవలం 40 అడుగుల లోతులోనే నీళ్లు పడేవి. నీరు పుష్కలంగా ఉండటంతో.. పంటలు బాగా పండాయి. అలానే గ్రామంలోని సారాయి దుకాణాలను ఖాళీ చేయించాడు.
1995లో ఆ ఊరిలో 170 కుటుంబాలు ఉండేవి. అందులో 165 కుటుంబాలు పేదరికంతో బాధ పడుతున్నవారే. కానీ పవార్ ఆలోచనలు, ప్రయత్నాల కారణంగా నేడు వారందరూ ధనవంతులుగా మారారు. కష్టపడి పంటలు పండిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఊళ్లో ఒక్కొక్కరి తలసరి ఆదాయం 30,000 రూపాయలు. ఇప్పుడు గ్రామంలో 255 కుటుంబాలు నివసిస్తుంటే, వాటిలో మూడు కుటుంబాలే పేదవి. మిగతా వాళ్లంతా ధనికులే. ఎక్కువ కార్లున్న గ్రామం కూడా ఇదే. కేవలం వర్షపు నీటిని ఒడిసి పట్టి, వాటితో పంటలు పండిస్తూ ఇలా మిలియనీర్లుగా మారారు వీళ్లంతా.
జొన్నలు, మొక్కజొన్న, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సజ్జలు వంటివి పండిస్తారు. ప్రతి రోజూ ఈ గ్రామం నుంచి 4000 లీటర్ల పాలను అమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా గుర్తించింది. ఒక్కడి కృషితో ఆ గ్రామం తలరాత మారడమే కాక ప్రపంచానకే ఆదర్శంగా నిలిచింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.