మహిళలకు రవాణా శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూన్ 1 నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు.
బస్సు ప్రయాణం చేయాలంటే బోలెడన్ని ఛార్జీలు అయిపోతాయి. అప్పుడప్పుడూ వెళ్లేవారి కంటే నిత్యం ఆఫీసులకు వెళ్లే మహిళలకు ప్రయాణ ఖర్చులు భారం అవుతాయి. ఉద్యోగం చేస్తున్నా కూడా సిటీలో చాలీ చాలని జీతాలతో బతుకు ఈడ్చడం కష్టమవుతుంది. అయితే ఇలాంటి వారి కష్టాలను తీర్చేలా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పని చేసే మహిళలే కాకుండా ఏ మహిళ అయినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వ బస్సుల్లో టికెట్ లేకుండా, ఎలాంటి షరతులూ లేకుండా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. దీంతో మహిళలు పండగ చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
అధికారం కైవసం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ఎన్నికల్లో హామీలు ఇస్తారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పితే జనం ఊరుకోరు. అందుకోసం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఎన్నికల్లో 5 హామీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి రూ. 50 వేల కోట్లు ఖర్చవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందో అన్న చర్చ మొదలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తున్నట్లు కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. ఈ హామీని అమలు చేయడంలో ఎలాంటి షరతులూ పెట్టబోమని, పని చేసే మహిళలు అయినా, ఇంకెవరైనా సరే మహిళలు అయితే టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని అన్నారు. జూన్ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉంటే అంతమందీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని అన్నారు. అయితే అన్ని ప్రభుత్వ బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణానికి సంబంధించిన అంశంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని రామలింగారెడ్డి అన్నారు. రవాణా శాఖలో ఖర్చులకు సంబంధించిన వివరాలను ఇప్పటికే సీఎం సిద్దరామయ్య కోరారని.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఆ వివరాలను సేకరించి ఇచ్చారని అన్నారు. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్, కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ మొత్తం నాలుగు ప్రభుత్వ రవాణా కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ నాలుగు కార్పొరేషన్ల నిర్వహణకు 2022-23 ఏడాదిలో రూ. 12,750 కోట్లు ఖర్చయ్యిందని మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.