భర్తల చేతిలో మోసపోయిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం 2.45 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం 2016లో అమలులోకి వచ్చింది. అయితే ఈ పథకం..
బాగా చదువుకున్నాడు, డబ్బుంది, మంచి ఉద్యోగం ఉంది. అమెరికాలో స్థిరపడ్డాడు. లేదా ఇంకేదో దేశంలో స్థిరపడ్డాడు. ఇంతకంటే మంచి సంబంధం మరొకటి ఉండదని చాలా మంది తండ్రులు తమ కూతుళ్లను ఎన్ఆర్ఐలకిచ్చి వివాహం చేసి అమెరికా పంపిస్తున్నారు. కొన్నాళ్ళకు మోజు తీరాక ఎన్ఆర్ఐ పెద్దమనిషి ఆమెను వదిలేస్తాడు. ఇలా విదేశీ భర్త లేదా ఎన్ఆర్ఐ చేతిలో మోసపోయిన మహిళలు అనేక మంది ఉంటారు. మోసపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక వేదనకు గురవుతారు. పరాయి దేశంలో భర్త మోసం చేసి పోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి వారు న్యాయపోరాటానికి దిగుదామన్నా డబ్బు ఉండదు. ఇలాంటి వారి కోసమే ఈ పథకం.
పరాయి దేశంలో అడ్వకేట్ ని పెట్టుకుని న్యాయ పోరాటం చేయడమంటే చిన్న విషయమేమీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. అందుకే అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. న్యాయ పోరాటం చేయడానికి, పరిహారం పొందడానికి 2000 డాలర్ల నుంచి 3000 డాలర్ల వరకూ ఆర్థిక సహాయం చేస్తోంది. భారత కరెన్సీ ప్రకారం రూ. 1.63 లక్షల నుంచి రూ. 2.45 లక్షలు అన్నమాట. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులను గానీ విదేశీయులను గానీ వివాహం చేసుకున్న భారతీయ మహిళల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవాస భారతీయులను వివాహం చేసుకున్న మహిళల నుంచి గత ఏడేళ్లలో 6 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ప్రభుత్వ జాతీయ మహిళా కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 2 వేలకు పైగా కేసులు విడాకులకు సంబంధించినవే.
ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు తమ భర్తల నుంచి విడాకులు గానీ భరణం గానీ ఆస్తి హక్కులు గానీ పొందడం కోసం విదేశీ కోర్టుల్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. దీని కోసం అక్కడ అడ్వకేట్ కి ఫీజు, కోర్టు ఫీజులు వంటివి చాలా ఖర్చు ఉంటుంది. ఇది భరించడం తమ వల్ల కాని మహిళలకు భారత ప్రభుత్వం రూ. 2.45 లక్షల వరకూ న్యాయ పోరాటం చేసేందుకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు వారికి కౌన్సిలింగ్ లాంటివి కూడా ఇచ్చి భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ పర్యవేక్షిస్తుంటాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, యూరప్ దేశాల్లో ఉన్న మహిళలకు 3 వేల డాలర్లు (రూ. 2.45 లక్షలు) సాయం చేస్తారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి 2 వేల డాలర్లు (రూ. 1.63 లక్షలు) ఆర్థిక సహాయం చేస్తారు.
భర్త వదిలేసినా, వరకట్నం కోసం వేధించినా, హింసకు గురవ్వడం, అత్తింటివారు పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకోవడం, పిల్లలను తన వద్ద నుంచి తీసుకెళ్లిపోవడం, భార్యను నిర్లక్ష్యం చేయడం, భరణం పొందడంలో సాయం కోసం, విదేశాల్లో కోర్టు ప్రక్రియల్లో సాయం కోసం ఈ పథకం వర్తిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్ పోర్టు, ప్రవాస భారతీయుడ్ని గానీ విదేశీ వ్యక్తిని గానీ వివాహం చేసుకుని మోసపోతే ఈ పథకం వర్తిస్తుంది. వివాహం జరిగి 15 ఏళ్ళు పూర్తి కాని మహిళలు ఈ పథకానికి అర్హులు. అయితే ఈ పథకం కింద డబ్బును నేరుగా ఇవ్వరు. మహిళలు వారు ఉంటున్న పరాయి దేశంలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. రాయబార కార్యాలయం గుర్తింపు పొందిన సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు.
ఎక్కడ ఉన్నాయనే వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో పొందుపరిచింది. ఆ వివరాల కోసం https://eoi.gov.in/ క్లిక్ చేయండి.
ఎన్నారై సెల్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
ప్లాట్ నం. 21, జసోలా ఇన్స్టిట్యూషనల్ ఏరియా
న్యూఢిల్లీ-110025
ఫోన్ నంబర్స్ : 011 – 26942369, 26944740, 26944754, 26944805, 26944809
మెయిల్: nricell-ncw@nic.in
ఎన్ఆర్ఐ లేదా విదేశీ భర్త మరణించినా కూడా ఈ కేసులో పరిహారం పొందవచ్చు. ఇలా విదేశీ వ్యక్తిని పెళ్లాడినా లేదా ప్రవాస భారతీయుడిని వివాహం చేసుకున్నా భర్త వదిలేసినా, వేధించినా అతని మీద కోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుంది. మరి ఈ పథకం గురించి మహిళల్లో అవగాహన రావాలంటే ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలానే ఈ పథకంపై మీ అభిప్రాయమేమిటో కూడా కామెంట్ చేయండి.